Govt Hospital Sent Body Home In A Garbage Trolley: మధ్యప్రదేశ్‌లోని డామో జిల్లా ఆసుపత్రిలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించారో తెలిపే హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన బాధితుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం తర్వాత ఇంటికి తరలించడానికి, సాధారణంగా చెత్త సేకరించేందుకు వాడే మున్సిపల్ ట్రాలీ వాహనాన్ని ఉపయోగించారు. మానవత్వాన్ని మంటగలిపే ఈ చర్య అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి కళ్లకు కట్టింది.
డామో జిల్లా ఆసుపత్రిలో ప్రభుత్వమే సమకూర్చిన రెండు శవ వాహనాలు (హీర్స్ వ్యాన్స్) ఉపయోగించకుండా నిరుపయోగంగా పడి ఉన్నప్పటికీ ఈ దారుణం జరిగింది. అయితే, ఆ శవ వాహనాలను ఆసుపత్రి లోపల చనిపోయిన రోగులకు మాత్రమే కేటాయించారట. ఈ బాధితుడు బయట హత్యకు గురైనందున, ఈ నిబంధన అతనికి వర్తించదని అధికారులు తేల్చేశారు.
ALSO READ: CYBER FRAUD : శిరిడీ సాయి పేరుతో మోసం.. నకిలీ వెబ్‌సైట్‌తో భక్తులకు టోకరా!
హటా పట్టణానికి చెందిన బాధితుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి శవ వాహనాన్ని కోరినా, వారికి అది దొరకలేదు. బదులుగా, వారికి నగర్ పాలిక పరిషత్ (మున్సిపల్ బాడీ) కు చెందిన చెత్త ట్రాలీని అప్పగించారు.
“మృతుడిని ఇంటికి చేర్చడానికి ప్రభుత్వం శవ వాహనాలను అందిస్తుంది. కేవలం అవసరమైన పత్రాలతో ఫోన్ చేస్తే సరిపోతుంది,” అని సివిల్ సర్జన్ ప్రహ్లాద్ పటేల్ చెప్పినప్పటికీ, అక్కడ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంది.
“మాకు చాలా కష్టమైంది. పోలీసుల వారు వాహనం అడిగినా, చివరకు చెత్త ట్రాలీనే దొరికింది,” అని మృతుడి బంధువు చందన్ సింగ్ వాపోయారు.
ALSO READ: Assam Rifles: అస్సాం రైఫిల్స్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు వీరమరణం
పదే పదే అదే అవమానం..
మధ్యప్రదేశ్‌లో ఇలాంటి అమానుష ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు మృతదేహాలను భుజాలపై, ద్విచక్ర వాహనాలకు కట్టి, చేతిబండ్లపై తరలించిన ఉదంతాలు ఉన్నాయి. ఇటీవల జూలైలో, విదిశలోని సిరోంజ్‌లో ఓ తండ్రి తన 15 ఏళ్ల కొడుకు మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌కు కట్టి వర్షంలో ప్రయాణించగా, తల్లి వెనుక నడిచింది. ఆసుపత్రిలో శవ వాహనం అడిగితే ‘లేదనే’ సమాధానం వచ్చింది. మైహార్‌లో అయితే ఏకంగా పోలీసులు ఓ మృతదేహాన్ని చెత్త ట్రక్కులో పడేయడం కెమెరాలకు చిక్కింది.
పేదలకు గౌరవంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రకటించిన ‘ముక్తి వాహన్’ (Shav Vahan Yojana) పథకం ఉన్నా, ఆ అత్యాధునిక ఏసీ వాహనాలు భోపాల్‌లో ‘ఘనమైన రాజకీయ ప్రారంభోత్సవం’ కోసం బురద నేలపై తుప్పు పడుతూ పడి ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త శవ వాహనాల పథకం అమలుకు నోచుకోకపోవడంతో, నిస్సహాయులైన పేదలు మరణం తర్వాత కూడా ఈ అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ALSO READ: Traffic Jam Death: 5 గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన అంబులెన్స్.. చిన్నారి మృతి


