Onion price crash in Madhya Pradesh : “పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది.. రవాణా ఖర్చులకు కూడా గిట్టుబాటు కాని దయనీయ పరిస్థితి దాపురించింది..” అంటూ మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందిన ఓ ఉల్లి రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస ధర లభించకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఉల్లి ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో ఉల్లి కేవలం రూపాయికి అమ్ముడుపోతుండటంతో, రైతులు కనీసం రవాణా ఖర్చులు కూడా రాబట్టుకోలేకపోతున్నారు.
వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో ఉల్లి ధరలు గణనీయంగా పడిపోయాయి. మార్కెట్‌కు కొత్త పంటతో పాటు, పాత నిల్వలు కూడా భారీగా వచ్చి చేరడంతో ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. మంగళవారం మాల్వా ప్రాంతంలో కిలో ఉల్లి ధర రూ.2 ఉండగా, మందసౌర్‌లో బుధవారం నాటికి ఆ ధర కేవలం రూ.1కి పడిపోయింది.
ఈ దయనీయ పరిస్థితిపై ఓ రైతు తన ఆవేదనను వెళ్లగక్కాడు. 30 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తరలించడానికి రూ.2000 ఖర్చు కాగా, అక్కడ అతనికి కేవలం రూ.250 మాత్రమే లభించిందని వాపోయాడు. ఈ నేపథ్యంలో, ఉల్లికి కనీస మద్దతు ధర (MSP) కల్పించి, తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఉల్లి రైతుల ఈ దుస్థితికి అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా పంట నాణ్యత దెబ్బతినడం, నిల్వ సౌకర్యాల కొరత, మార్కెట్‌లో డిమాండ్ బలహీనపడటం వంటి అంశాలు ఉల్లి ధరల పతనానికి దారితీశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రైతులు తమ పంటను నిల్వ చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో, తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఈ సమస్య కేవలం మధ్యప్రదేశ్‌కే పరిమితం కాలేదు. మహారాష్ట్ర వంటి ఇతర ఉల్లి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లోని రైతులు కూడా ఇదే విధమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వారు కూడా ఉల్లికి కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.


