ప్రపంచవ్యాప్తంగా హిందువులు పవిత్రంగా భావించే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘మహా కుంభమేళా'(Maha kumbh Mela) అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఈ కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భారతీయులతో పాటు విదేశీయులు కూడా తరలివస్తున్నారు. నాగ సాధువులు, అఘోరాలతో కుంభమేళాలో ఆధ్యాత్మికం వెల్లువిరుస్తోంది. నెల రోజుల పాటు జరిగే ఈ అద్భుతమైన కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
దీంతో ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) అంచనా వేసింది. స్థానిక హోటల్స్, గెస్ట్ హౌస్‌లు, తాత్కాలిక బస ఏర్పాట్ల ద్వారా రూ.40,000 కోట్లు ఆర్జించే అవకాశం ఉందని పేర్కొంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్, వాటర్, బిస్కెట్లు, జ్యూస్‌లు, మీల్స్‌తో సహా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగానికి రూ.20,000 కోట్లు.. నూనె, దీపాలు, గంగా జలం, మతపరమైన పుస్తకాలు మరో రూ. 20,000 కోట్లు.. టూర్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీలు, సంబంధిత కార్యకలాపాలు వంటి పర్యాటక సేవల ద్వారా మరో రూ. 10,000 కోట్లు రావొచ్చని తెలిపింది. ఈ కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.