ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో పలువురు భక్తులు మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) భక్తులను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు.
త్రివేణి సంగమం ఘాట్ వద్దకు ఎవరూ రావొద్దని భక్తులకు సూచించారు. తమకు సమీపంలో ఉన్న ఘాట్ల వద్దే అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఘాట్లను ఏర్పాటు చేశామన్నారు. మిగతా అన్ని ఘాట్లలో పరిస్థితి సాధారణంగా ఉందని తెలిపారు. అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. ఇవాళ మౌని అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మహా కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
మహా కుంభమేళాలో మౌనీ అమావాస్యకు ప్రత్యేకత ఉంది. ఈరోజున గంగ, యమునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు. దీంతో బుధవారం ఒక్కరోజే పుణ్యస్నానాలకోసం 10కోట్లకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే కుంభమేళా ప్రారంభమైన దగ్గరి నుంచి ఇప్పటివరకు 15కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం.