Mahaghatbandhan Manifesto: దేశమంతా ఇప్పుుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలవైపు చూస్తోంది. ఓ వైపు ఎన్డీయే మరోవైపు మహా ఘట్‌బంధన్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంది. ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ, మజ్లిస్ పార్టీలో బరిలో నిలవడంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో మహా ఘట్‌బంధన్ ఎన్నికల మేనిఫెస్టో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలేముంది ఈ మేనిఫెస్టోలో. ఎందుకు ఇండియా కూటమి మేనిఫెస్టోపై ఎన్డీయే పార్టీలు, మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు. సాధ్యాసాధ్యాలేంటనేది పరిశీలిద్దాం…
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు 7.43 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ ఇతర పార్టీలతో బరిలో దిగిన ఎన్డీయే ఇంకా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు. కానీ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలతో ఏర్పడిన మహా ఘట్‌బంధన్ విడుదల చేసిన మేనిఫెస్టో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో పడేసిందని చెప్పాలి. మహా ఘట్‌బంధన్ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ సహా ఎన్డీయే పార్టీలే కాకుండా మేధావులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా కేవలం అధికారం కోసం ఈ తరహా హామీలు ఇస్తోందంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ నేపధ్యంలో అసలు మహా ఘట్‌బంధన్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో ఏముంది, ఎందుకింత చర్చ జరుగుతోందో చూద్దాం..
మహా ఘట్‌బంధన్ ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు
మహా ఘట్‌బంధన్ తరపున బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటితమైన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ ముఖచిత్రంతో సంకల్ప పత్ర 2025 పేరుతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. సంపూర్ణ బీహార్-సంపూర్ణ పరివర్తన్, తేజస్వి ప్రతిజ్ఞ, తేజస్వి ప్రణామం పేరుతో ఈ మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోను ప్రధానంగా ఉద్యోగం, సంక్షేమం, ప్రభుత్వ సంస్కరణలు అంశాలుగా రూపొందించారు. ఇందులో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అత్యంత ప్రధానమైంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లోని మహిళలకు 30 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగం, మహిళలకు నెలకు 2500 రూపాయలు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 25 లక్షల పరిమితితో హెల్త్ ఇన్సూరెన్స్, 500 రూపాయలకు గ్యాస్ సిలెండర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం ఇతర ముఖ్య హామీలుగా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం హామీ నెరవేర్చేందుకు అధికారంలో వచ్చిన 20 రోజుల్లో చట్టం తీసుకొస్తామని చెబుతోంది. అంతేకాకుండా 20 నెలల్లో ఉద్యోగాలిచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. పాత పెన్షన్ విధానం అంటే ఓపీఎస్ పునరుద్ధరిస్తామనేది మరో ముఖ్యమైన హామీగా ఉంది.
సాధ్యాసాధ్యాలు, విమర్శలు
మహా ఘట్‌బంధన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా, విమర్శలకు దారితీస్తోంది. కేవలం అధికారం కోసమే మహా ఘట్‌బంధన్ ఈ తరహా హామీలిస్తోందంటూ బీజేపీ, జేడీయూ విమర్శిస్తున్నాయి. బీహార్ రాష్ట్రంలో అన్ని ఉద్యోగాలు లేవని, అంత బడ్జెట్ లేదంటున్నారు. ఇది పూర్తిగా ఆర్ధిక భారంతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదని..అన్ని ఉద్యోగాలు పొందేంత సంఖ్యలో చదువుకున్నవాళ్లే లేరంటున్నారు. ఈ తరహా హామీల కారణంగా బీహార్ రాష్ట్ర వార్షిక ఖర్చు 6 శాతం పెరుగుతుందంటున్నారు. ఇది పూర్తిగా అవాస్తవికతతో కూడుకున్న వ్యవహారంగా చెబుతున్నారు.
సాధ్యాసాధ్యాలు
ఎందుకంటే బీహార్ మొత్తం ఓటర్ల సంఖ్య 7.43 కోట్లు కాగా అందులో కుటుంబాల సంఖ్య 2.76 కోట్లు. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 74.3 శాతం ఉంది. వీరిలో మెట్రిక్యులేషన్ వరకు చదివినవారు 14.7 శాతం ఉంటే గ్రాడ్యుయేట్లు 6.1 శాతం ఉన్నారు. ఇక పీజీ విద్యార్ఙతలు కలిగినవారు కేవలం 0.82 శాతం మాత్రమే. ఆ తరువాత 1-5వ తరగతి వరకు చదివినవారి సంఖ్య 22.6 శాతం కాగా, 6-10 వరకు చదివినవారు 14 శాతం ఉన్నారు. మహా ఘట్‌బంధన్ హామీ ప్రకారం కుటుంబానికో ఉద్యోగం అంటే 2.76 కోట్ల ఉద్యోగాలు అవసరమౌతాయి. నెలకు 30 వేల జీతం లెక్కేసినా ఏడాదికి 9 లక్షల కోట్లు దాటుతుంది. బీహార్ రాష్ట్ర బడ్జెట్ మాత్రం 3 లక్షల కోట్లే ఉంది. మెట్రిక్ చదివివవారే 14 శాతం ఉన్నప్పుడు 2.76 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలివ్వడం ఎలా సాధ్యమనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.
తేజస్వి యాదవ్ ఏమంటున్నారు
అయితే ఆర్జేడీ అధినేతగా, మహా ఘట్ బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో ఉన్న తేజస్వి యాదవ్ మాత్రం ఇది సాధ్యమే అంటున్నారు. 2023 బీసీ కుల గణన సమయంలో సేకరించిన డేటాను వివిధ రంగాల్లో నిపుణులతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కేవలం అధికారం కోసం, ఓట్ల కోసం ఇచ్చిన హామీ కాదని, సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. త్వరలో దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ విడుదల చేస్తామని, అందులో అన్ని సందేహాలకు సమాధానం ఉంటుందంటున్నారు.


