మానవత్వం మరిచిపోయిన ఘోర ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన 29 ఏళ్ల వ్యక్తి బాలికను మానసికంగా, శారీరకంగా దుర్వినియోగం చేశాడు. శనివారం థానే పోలీసులు ఘోరమైన ఘటన గురించి తెలిపారు.
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో బాలిక చికిత్స పొందేందుకు తన కుటుంబంతో కలిసి ఉండేలా సదరు నిందితుడు ఏర్పాట్లు చేశాడు. ఇద్దరూ బీహార్‌లోని ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో నమ్మకంతో కుటుంబం అతడిని ఆదరణగా చూసింది. రెండు నెలల క్రితమే అతడు వారిని కలుసుకున్నాడు. మొదట్లో సహాయం చేస్తూ చనువు పెంచుకున్నాడు. కానీ బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో మానవత్వం మరిచి, మూడుసార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు.
చిన్నారికి ముంబైలో కీమోథెరపీ జరుగుతుండగా, ఒక రొటీన్ వైద్య పరీక్షలో ఆమె గర్భవతిగా తేలడం ఈ మోసాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణలో బాలిక పేర్కొన్న వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అప్పటికే బీహార్‌కు పరారైన అతడిని పోలీసులు అక్కడ నుంచి పట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఏసీపీ శైలేష్ కాలే, బాలిక పరిస్థితిని తెలియజేస్తూ నిందితుడిపై పోక్సో చట్టం తో పాటు పలు కఠిన నిబంధనల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిని ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీకి తరలించి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ ఘటన పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. క్యాన్సర్ అనే భయంకర వ్యాధితో పోరాడుతున్న ఓ బాలికపై ఇలాంటి దాడి జరగడం సమాజం ఎటు పోతుందనే ప్రశ్నను తలెత్తిస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పలు మహిళా సంఘాలు పేర్కొన్నాయి.