Bike Taxi in Maharashtra: మహారాష్ట్రలో ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత అనధికార బైక్ ట్యాక్సీ సేవలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. రవాణా నిబంధనలను పాటించకపోవడం, సరైన అనుమతులు లేకపోవడం, ప్రజా రక్షణ కారణాల దృష్ట్యా ఈ బైక్ రైడింగ్ సేవలను తక్షణమే నిలిపివేయాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల మహిళ మృతి ఘటన తర్వాత ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలు అక్రమమని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana/lookout-notices-on-bandi-bhagirath-search-with-5-special-teams/
ముంబైలోని బాంద్రా సమీపంలో అనధికార బైక్ టాక్సీ ప్రమాదంలో ఒక మహిళ మరణించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఈ చర్యలను మరింత వేగవంతం చేసింది. ఈ బైక్ ట్యాక్సీలలో డ్రైవర్ల వెరిఫికేషన్, ఇన్సూరెన్స్ కవరేజ్, మహిళల భద్రతకు సంబంధించి సరైన అత్యవసర స్పందన వ్యవస్థలు లేవని పేర్కొంది. అవసరమైన పత్రాలను సమర్పించడంలో, రవాణా శాఖ నిబంధనలను పాటించడంలో విఫలమవడంతో యాప్ సంస్థల తాత్కాలిక లైసెన్సులను రద్దు చేసింది. మరోవైపు చట్టవిరుద్ధంగా నడుస్తున్న బైక్ టాక్సీల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని ఆటో, రెగ్యులర్ క్యాబ్ డ్రైవర్ల సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలు, నిరసనలు చేపట్టాయి.
ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుస్తున్న అనధికార బైక్ టాక్సీ యాప్‌లను గూగుల్, యాపిల్ సంస్థలు తక్షణమే బ్లాక్ చేయాలని మహారాష్ట్ర సైబర్ విభాగం నోటీసులు జారీ చేసింది. ఈ బైక్ టాక్సీ సేవలను వెంటనే నిలిపివేయాలని, వినియోగదారులు బుక్ చేసుకునేందుకు వీలుగా ఉన్న వాటి యాప్స్‌ను తొలగించాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి ఈ అగ్రిగేటర్ల బైక్ టాక్సీ యాప్‌లను తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
ప్రభుత్వ తాజా చర్యతో.. సాధారణ ఫోర్-వీలర్ క్యాబ్ సేవలు యథావిధిగా నడుస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం తరపున తక్కువ ధరకే ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా కొత్త ప్రభుత్వ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

