Customized luxury auto rickshaw : మూడు చక్రాల బండిలో కారా? కాదు.. కదిలే రాజప్రసాదమా? ఏసీ చల్లదనం, డీజే హోరు, టీవీ వినోదం.. ఇవన్నీ ఒకే ఆటోలో! చూసినవారు లగ్జరీ కారు కూడా దీని ముందు దిగదుడుపే అనక మానరు. మహారాష్ట్ర వీధుల్లో ఇప్పుడు ఓ ఆటో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు ఈ అద్భుతాన్ని సృష్టించింది ఎవరు? లక్షలు పోసి ఈ ‘ప్యాలెస్’ ను ఎందుకు తయారు చేశాడు? ఆటో ధర కంటే అలంకరణకే ఎక్కువ ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటి?
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడి అసామాన్య స్వప్నం ఈ లగ్జరీ ఆటో రూపంలో సాక్షాత్కరించింది. పట్టుదలతో తన కలను నిజం చేసుకుని, ఇప్పుడు అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆ యువకుడి పేరు కృష్ణ మధుకర్ రోడ్గే..
సామాన్యుడి అసామాన్య స్వప్నం : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా, బద్నేరాకు చెందిన 32 ఏళ్ల కృష్ణ మధుకర్ రోడ్గే ఎనిమిదో తరగతి వరకే చదువుకున్నాడు. ఉమ్మడి కుటుంబంలో నివసించే కృష్ణ, పగలు గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్లు డెలివరీ చేస్తూ, రాత్రిళ్లు అద్దె ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన, అత్యంత విలక్షణమైన ఆటో ఉండాలనేది అతని చిరకాల కోరిక. తన ఆశయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారు ప్రోత్సహించడంతో తన పాత ఆటోను అమ్మేసి, కొత్త ఆటో కొనుగోలుతో తన కలల ప్రయాణానికి తొలి అడుగు వేశాడు.
కలల ఆటోకు రూపురేఖలు : కొత్త ఆటోను షోరూమ్ నుంచి నేరుగా తనకు తెలిసిన వెల్డింగ్ నిపుణులు మహ్మద్ ముజమ్మిల్, నస్రుల్లా ఖాన్ వద్దకు తీసుకెళ్లాడు. తన ఆలోచనను వారికి వివరించి, ఆటోను ఓ అద్భుతంగా తీర్చిదిద్దమని కోరాడు.
కఠోర శ్రమ: షేక్ ముజాహిద్, షేక్ షాహిద్ అనే సోదరులతో కలిసి ఈ బృందం నెలన్నర రోజుల పాటు రేయింబవళ్లు శ్రమించింది.
విలాసవంతమైన హంగులు: ఆటోకు పూర్తిస్థాయి ఏసీని అమర్చారు. చల్లగాలి బయటకు పోకుండా డోర్లు బిగించారు. ప్రయాణికుల వినోదం కోసం టీవీ, డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట ప్రయాణాన్ని ఓ వేడుకలా మార్చేందుకు రంగురంగుల లైటింగ్ అమర్చారు.
అద్భుతమైన డిజైన్: ఆటో టాప్ డిజైన్ నుంచి సీటు కవర్ల రంగు వరకు ప్రతీదీ ప్రణాళికాబద్ధంగా, అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు.
ఆటో ఖరీదును మించిన హంగులు : కృష్ణ ఈ ఆటోను షోరూమ్‌లో రూ. 2,85,000 పెట్టి కొనుగోలు చేయగా, దానిని ఈ లగ్జరీ ప్యాలెస్‌గా మార్చడానికి ఏకంగా రూ. 3 లక్షలు ఖర్చు చేశాడు. అతను తన ఆటోకు ముద్దుగా ‘విదర్భ రాణి’ అని పేరు పెట్టుకున్నాడు. దీపావళికి ప్రారంభమైన ఈ ఆటో, ఇప్పుడు అమరావతి-బద్నేరా మార్గంలో తిరుగుతూ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఎంతోమంది ఈ ఆటోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కేవలం విలాసమే కాదు.. సేవాగుణం కూడా : ఈ ఆటో ప్రత్యేకత కేవలం విలాసవంతమైన సౌకర్యాలే కాదు, కృష్ణ పెద్ద మనసు కూడా. “నెలన్నర కష్టపడి నా ‘విదర్భ రాణి’ని తీర్చిదిద్దాక, మొదట కుటుంబంతో కలిసి మా కులదైవం తుల్జా భవానీ మాత దర్శనానికి వెళ్లాను. అమ్మవారి ఆశీస్సులతోనే ప్రయాణికులను ఎక్కించడం ప్రారంభించాను” అని కృష్ణ తెలిపాడు.
అంతేకాదు, అత్యవసర పరిస్థితుల కోసం ఆటోలో ఒక మంచాన్ని కూడా ఏర్పాటు చేశాడు. పేద రోగులను తన ఆటోలో ఆసుపత్రికి ఉచితంగా చేరవేస్తానని చెప్పి తన సేవాగుణాన్ని చాటుకుంటున్నాడు. ఈ మంచి మనసున్న ఆటో డ్రైవర్‌పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


