India’s first Tesla car owner : ప్రపంచాన్ని తన ఎలక్ట్రిక్ కార్లతో ఉర్రూతలూగిస్తున్న టెస్లా, ఎట్టకేలకు భారత రోడ్లపై పరుగులు పెట్టడం ప్రారంభించింది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ దిగ్గజ కంపెనీ, తన తొలి కారును శుక్రవారం భారత్‌లో డెలివరీ చేసింది. ఈ చారిత్రక ఘట్టానికి, ఓ మంత్రి తన మనవడిపై చూపిన ప్రేమ కూడా తోడవడంతో, ఈ వార్త మరింత ఆసక్తికరంగా మారింది. ఇంతకీ, భారత్‌లో తొలి టెస్లా కారును సొంతం చేసుకున్న ఆ అదృష్టవంతులు ఎవరు..?
మంత్రి చేతికి టెస్లా తాళాలు : భారత్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి టెస్లా కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కొనుగోలు చేశారు. ముంబయిలోని టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రతినిధులు, శుభారంభానికి గుర్తుగా సెప్టెంబర్ 5న, పూర్తి తెలుపు రంగులో మెరిసిపోతున్న ‘మోడల్ Y’ కారు తాళాలను మంత్రికి అందజేశారు. జులై 15న ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో టెస్లా తన తొలి షోరూమ్‌ను ప్రారంభించగా, ఇప్పటివరకు 600కు పైగా బుకింగ్‌లు జరిగినట్లు సమాచారం.
మనవడి కోసం.. పర్యావరణం కోసం : ఈ కారును తాను తన ప్రియమైన మనవడికి కానుకగా ఇస్తున్నట్లు మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. అయితే, దీని వెనుక ఓ సామాజిక సందేశం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు.
“దేశంలో తొలి టెస్లా కారును కొన్నందుకు చాలా గర్వంగా ఉంది. దీనికోసం నేను ఎలాంటి డిస్కౌంట్ తీసుకోలేదు, పూర్తి మొత్తం చెల్లించాను. నా మనవడు ఈ కారులో పాఠశాలకు వెళ్లి, తోటి విద్యార్థులకు పర్యావరణ హిత వాహనాల ప్రాముఖ్యత గురించి వివరిస్తాడు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) ప్రోత్సహించడంలో ముందుంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే నేను ఈ వాహనాన్ని కొనుగోలు చేశాను,” అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని టోల్ బూత్‌ల వద్ద ఈవీ వాహనాలకు రాయితీలు ఇస్తున్నట్లు కూడా ఆయన గుర్తుచేశారు.
భారత్‌లో టెస్లా మోడళ్లు, ధరలు : ప్రస్తుతానికి టెస్లా భారత్‌లో రెండు ‘మోడల్ Y’ వేరియంట్లను విక్రయిస్తోంది.
Y RWD: దీని ధర రూ. 61.07 లక్షలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ ప్రయాణిస్తుంది.
Y LR RWD (లాంగ్ రేంజ్): దీని ధర రూ. 69.15 లక్షలు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కి.మీ ప్రయాణిస్తుంది. మంత్రి ప్రతాప్ సర్నాయక్ కొనుగోలు చేసింది ఈ వేరియంటే. పూర్తిగా విదేశాల్లో తయారై (CBU) దిగుమతి అవుతున్నందున, అమెరికా ధరలతో పోలిస్తే భారత్‌లో వీటి ధరలు దాదాపు రెట్టింపుగా ఉన్నాయి. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, గురుగ్రామ్‌లలో టెస్లా కార్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అత్యధిక భద్రత, అత్యాధునిక ఫీచర్లతో, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఈవీగా రికార్డు సృష్టించిన ‘మోడల్ Y’, ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలకనుంది.


