Home Library : స్మార్ట్ ఫోన్ల మోజులో పడి పుస్తక పఠనం ‘పటాపంచలై’ పోతున్న రోజులివి. అరచేతిలో వైకుంఠంలా సమాచారం ఉన్నా.. పుస్తకం చదివితే వచ్చే జ్ఞానం, సంతృప్తి వేరని తెలిసిన వారు అరుదు. సరిగ్గా ఇలాంటి డిజిటల్ యుగంలోనూ.. అక్షరమే ఆయుధంగా, పుస్తకమే ప్రపంచంగా బతుకుతున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ ఉపాధ్యాయుడు. కేవలం చదవడం మాత్రమే కాదు.. తన ఇంటినే ఏకంగా ఒక ‘గ్రంథాలయం’గా మార్చేసి వేలాది మందికి విజ్ఞానాన్ని పంచుతున్నారు.
ఇంట్లోకి అడుగుపెడితే.. అక్షరాల లోకమే : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా గంగాపూర్ ప్రాంతానికి వెళితే.. డాక్టర్ సునీల్ గైక్వాడ్ ఇల్లు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే టీవీనో, సోఫానో కాదు.. ఎటు చూసినా నిలువెత్తు పుస్తకాలే దర్శనమిస్తాయి. మరాఠ్వాడా శిక్షణ్ ప్రసారక్ మండల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సునీల్.. తన జీవితార్జితాన్ని పుస్తకాల కోసమే వెచ్చించారు. ఆయన ఇంట్లో ఆంగ్ల సాహిత్యం, చరిత్ర, సైన్స్, తత్వశాస్త్రం, పొలిటకల్ సైన్స్, సమాజశాస్త్రం సహా ప్రముఖుల జీవిత చరిత్రలు కొలువుదీరాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం ఆయన వేల సంఖ్యలో పుస్తకాలను సేకరించి, వాటిని సబ్జెక్టుల వారీగా క్రమపద్ధతిలో అమర్చారు.
నిత్య విద్యార్థిగా.. విజ్ఞాన దాతగా : “గురువు ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలి” అన్న మాటకు సునీల్ గైక్వాడ్ నిలువెత్తు నిదర్శనం. 1993లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన.. అక్కడితో ఆగిపోలేదు. 2008లో ఎం.ఏ (ఇంగ్లిష్), 2011లో ఎంఫిల్, 2018లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా 2022లో ‘స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (SET)లోనూ ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించారు. తాను చదవడమే కాదు.. తన దగ్గరకు వచ్చే విద్యార్థులను “రోజుకు కనీసం కొన్ని పేజీలైనా చదవండి” అని ప్రోత్సహిస్తుంటారు. పాఠం చెప్పేటప్పుడు కేవలం పాఠ్యపుస్తకానికే పరిమితం కాకుండా.. అనేక రిఫరెన్స్ పుస్తకాల సారాంశాన్ని జోడించి విద్యార్థుల్లో జిజ్ఞాసను రగిలిస్తుంటారు.
వేలాది డిజిటల్ పుస్తకాలు.. ఒక్క క్లిక్ దూరంలో : కాలానికి అనుగుణంగా మారడమే అసలైన ప్రగతి. సునీల్ గైక్వాడ్ తన ఇంట్లో 3,000కు పైగా భౌతిక పుస్తకాలను అందుబాటులో ఉంచడమే కాకుండా.. సుదూర ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల కోసం ‘డిజిటల్ బాట’ పట్టారు. నెట్ (NET), సెట్ (SET) వంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం ఏకంగా 15,000 పుస్తకాలను పీడీఎఫ్ (PDF) రూపంలో భద్రపరిచారు. దేశంలో ఎక్కడి నుంచైనా విద్యార్థులు అభ్యర్థిస్తే చాలు.. ఉచితంగా ఆ మెటీరియల్‌ను పంపిస్తూ ఎందరో ఉద్యోగాల సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సర్కారు డిజిటల్ లైబ్రరీ.. అదనపు వరం : గైక్వాడ్ స్ఫూర్తితో పాటు, కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ గ్రంథాలయాలను ప్రోత్సహిస్తోంది. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ రియాజ్ మాట్లాడుతూ.. “కేంద్రం 2015లో ప్రారంభించిన జాతీయ డిజిటల్ గ్రంథాలయం (NDL) ద్వారా 1.7 కోట్ల విజ్ఞాన వనరులు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులు ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే.. దేశవ్యాప్తంగా ఉన్న వర్సిటీల పాఠ్యపుస్తకాలు, పరిశోధనా పత్రాలను ఉచితంగా చదువుకోవచ్చు” అని తెలిపారు. 160కి పైగా వనరుల నుంచి, 200 భాషల్లో సమాచారం లభ్యమవుతోందని గ్రంథాలయ ఉద్యమకారుడు రవి కుమార్ పేర్కొన్నారు.

