మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో.. 20 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ కోచ్ లో మంటలు చెలరేగాయనే వదంతులే ప్రమాదానికి కారణమని రైల్వే అధికారులు, పోలీసులు చెబుతున్నారు. ట్రైన్ లో మంటలు వ్యాపించాయని చాలా మంది ప్రయాణికులు మంటల భయంతో చైన్ లాగి పక్క రైల్వే ట్రాక్‌పైకి దూకారు.
అయితే అదే సమయంలో ఆ ట్రాక్ పై వస్తున్న మరో రైలు ప్రయాణికులను ఢీ కొట్టిందని ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 20మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
మహారాష్ట్ర జలగావ్ జిల్లా పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోరం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. మంటలు వ్యాపించాయన్న వదంతులు ఎందుకు వచ్చాయి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఈ ఘటనలో మృతి చెందిన వారంతా యూపీ వాసులే అని తెలుస్తోంది. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.