Malegaon 2008 Blasts Case Verdict: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో 17 ఏళ్ల సుదీర్ఘ విచారణకు తెరపడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబయిలోని ప్రత్యేక ఎన్‌ఐఏ (NIA) కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితులపై నేరారోపణలను ప్రాసిక్యూషన్ నిస్సందేహంగా నిరూపించడంలో విఫలమైందని, కేవలం అనుమానం ఆధారంగా వారిని దోషులుగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. దాదాపు ఇరవై ఏళ్ళపాటు నడిచిన ఈ కేసులో అంతిమ న్యాయం ఎవరి పక్షాన నిలిచింది..? ఇంతకీ ప్రాసిక్యూషన్ వైఫల్యానికి దారితీసిన పరిస్థితులేంటి..? కోర్టు తీర్పు వెనుక ఉన్న బలమైన కారణాలేమిటి..?
నాడు ఏం జరిగింది:
2008 సెప్టెంబర్ 29న రంజాన్ మాసం ప్రార్థనల సమయంలో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్‌లోని రద్దీగా ఉండే భికుచౌక్ ప్రాంతంలో శక్తిమంతమైన బాంబు పేలింది. ఒక టూవీలర్‌లో అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) పేలడంతో ఆరుగురు అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 101 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించింది.
దర్యాప్తులో మలుపులు.. NIA ఎంట్రీ :
ఘటనపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) తొలుత దర్యాప్తు చేపట్టింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్‌తో కలిపి, ఈ కేసులో పలువురు నిందితులుగా ఉన్నారు. అయితే, దర్యాప్తు పురోగతిలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. 2011లో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి అప్పగించింది.
ALSO READ: https://teluguprabha.net/national-news/union-cabinet-decisions-farmers-cooperatives-infra-boost/
17 ఏళ్ల విచారణ.. తుది తీర్పు:
ఎన్‌ఐఏ దర్యాప్తు అనంతరం కేసు ముంబయిలోని ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సుదీర్ఘ విచారణలో భాగంగా మొత్తం 220 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. విచారణ ప్రారంభానికి ముందే 26 మంది సాక్షులు మరణించడం గమనార్హం. ఆశ్చర్యకరంగా, 2016లోనే ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించిన ఒక ఛార్జ్‌షీట్‌లో, ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో సహా పలువురు నిందితులపై బలమైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ వారికి క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రాసిక్యూషన్ వైపు నుంచి వాదనలు, సాక్షుల విచారణ అనంతరం, నిందితుల ప్రమేయాన్ని నిస్సందేహంగా నిరూపించే ఆధారాలను సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. అనుమానాలకు అతీతంగా నేరాన్ని రుజువు చేయలేనప్పుడు, సంశయలాభం (Benefit of Doubt) నిందితులకే చెందుతుందని పేర్కొంటూ, ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో, 17 ఏళ్లుగా తమపై పడిన ఉగ్రవాద ముద్రతో జైలు జీవితం గడిపిన నిందితులకు ఊరట లభించినట్లయింది.


