Congress President Mallikarjun Kharge On BJP: స్వాతంత్ర్య దినోత్సవ వేళ దేశ రాజధానిలో రాజకీయాలు వేడెక్కాయి! కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్‌లో బతికున్నవారిని సైతం ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగిస్తున్నారు..? కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల గొంతు నొక్కే ఆయుధాలుగా మారాయా..? అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందా..?
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారాన్ని కాపాడుకోవడం కోసం కమలం పార్టీ ఎంతటికైనా వెళ్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
“బతికున్నోళ్లను చంపేసి.. ఓట్లు తీసేస్తున్నారు”: బీహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఖర్గే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/india-russia-crude-oil-imports-unaffected-by-trump-tariffs/
“ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ అధికారాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తుంది. బీహార్‌లో ‘ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ పేరిట బహిరంగంగానే ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. ఇంకా బతికున్న చాలా మందిని చనిపోయినట్లుగా ప్రకటించి వారి ఓటు హక్కును హరిస్తున్నారు. ఏ ప్రాతిపదికన ఈ ఓట్లను తొలగించారని అడిగితే ఎన్నికల సంఘం వద్ద సమాధానం లేదు. ఈ క్రమంలో ప్రజల గొంతును విన్న సుప్రీం కోర్టు, ఓటర్ల జాబితాను బహిరంగంగా ఉంచాలని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆసక్తికరమైన విషయమేమిటంటే, బీహార్‌లో దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించినా అధికార పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. దీన్నిబట్టే ఈ ప్రక్రియ వల్ల ఎవరికి లాభమో అర్థమవుతోంది.”
– మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
సంస్థల దుర్వినియోగం.. పక్కన ఎవరూ లేరు : కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను కేవలం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికే వాడుకుంటున్నారని ఖర్గే ఆరోపించారు. ఒకప్పుడు పండిట్ నెహ్రూ ప్రవేశపెట్టిన అలీన విధానంతో అంతర్జాతీయంగా భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉండేదని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మనం గొంతుకగా ఉండేవాళ్లమని, కానీ నేటి బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల మన పక్కన నిలిచే దేశమే లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/heavy-rains-in-maharashtra-waterlogging-in-airports/
రాజ్యాంగమే అత్యున్నతం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్యానికి నిష్పక్షపాత ఎన్నికలే పునాది అని ఖర్గే అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వాలు, దార్శనికత కలిగిన నాయకులు దేశానికి బలమైన పునాదులు వేశారని, దాని ఫలితమే నేటి మన అభివృద్ధి అని పేర్కొన్నారు. పేద, ధనిక, స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ “ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ” అనే సమాన హక్కును కల్పించిన భారత రాజ్యాంగమే అత్యున్నతమని ఆయన ఉద్ఘాటించారు.


