మణిపూర్ లో హింసాత్మక ఘటనలు (Manipur Violence) ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి భద్రతలు కాపాడేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి బహిరంగ లేఖ రాశారు. మణిపూర్ లో శాంతిని పునరుద్ధరించడంలో కేంద్రం, బీజేపీ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మణిపూర్ లో జాతుల ఘర్షణతో పెద్ద ఎత్తున హింసకాండ చెలరేగినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించకపోవడంపై నిలదీశారు.
ఇంకా ఆయన లేఖలో ఏం రాశారంటే… “మణిపూర్ గత 18 నెలలుగా హింసాత్మక ఘటనలు ఎదుర్కొంటుండడంతో దేశం పెను విషాదాన్ని చవిచూస్తోంది. ఈ ఘటనల్లో మహిళలు, చిన్నారులు, అప్పుడే పుట్టిన శిశువులు సహా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయి శరణార్థి శిబిరాల్లో మగ్గుతున్నారు. అశాంతి కారణంగా మణిపూర్ ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. వ్యాపారాలు మూతపడ్డాయి. ఉపాధులు కోల్పోయారు. ప్రొఫెషనల్స్ సొంత ఇళ్లను కూడా వదిలేసి వెళ్లిపోయారు. నిత్యవసరాలు అయిన ఆహారం, మందుల కొరత ఎక్కువైంది. 2023 నుంచి జాతీయ రహదారులు దిగ్బంధనం చేశారు. స్కూళ్ళు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. నిరాశ్రయులై శిబిరాల్లో తలదాచుకుంటున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మణిపూర్ ప్రజలు మూగవేదన అనుభవిస్తున్నారు” అని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోయి సొంత గడ్డపైనే అభద్రతాభావంతో గడుపుతున్నారు. ప్రధానమంత్రి గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ… తమ ప్రాణాలు, ఆస్తులు కాపాడతారనే నమ్మకాన్ని మణిపూర్ ప్రజలు కోల్పోయారు” అని ఖర్గే రాసిన లేఖలో పేర్కొన్నారు.