Mamata Banerjee vows to stage a dharna: ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తాజాగా దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేకపోయినా తమ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. అవసరమైతే తనను అరెస్టు చేసుకోండని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, టీఎంసీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో ఉన్న ప్రశాంత వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదని, ప్రజలు భయాందోళనల మధ్య జీవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులు క్రమంగా దెబ్బతింటున్నాయని, రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు.
Also read: Janasena : జనసేనకు హైకోర్టు జలక్: హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ – న్యాయస్థానంలో చుక్కెదురు!
వారు వెళ్లినా పార్టికి నష్టమేమీ లేదు..
ఇక, టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నాయకుల్ని ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లే వారి వల్ల నష్టమేమీ లేదని మమతా బెనర్జీ అన్నారు. అలాంటి పరిణామాలు పార్టీ పునర్నిర్మాణానికి ఉపయోగపడతాయని, భవిష్యత్తులో టీఎంసీ మరింత బలంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా పనిచేస్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలమన్నారు. పోలీసులు తమ నిరసనకు అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఒక రాజకీయ పార్టీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేశారు. కోల్‌కతాలో నిరసనకు అనుమతి ఇవ్వకపోతే ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లి, అవసరమైతే ఢిల్లీలో నిరసన చేపడతామని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని కూడా ఆమె ఆరోపించారు. దాదాపు 12 మంది పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, వేలాది మంది కార్యకర్తలు అరెస్టయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీదీ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నాయి.

