TMC Mamata Banerjee Protest Against ED: కోల్‌కతాలో ఐ- ప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులను నిరసిస్తూ సీఎం మమతా బెనర్జీ శుక్రవారం నిరసన చేపట్టనున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఐ- ప్యాక్ కార్యాలయంతో పాటు, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో సీఎం మమతా ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు ఈడీ ఆరోపించింది. ఆ కాసేపటికే టీఎంసీ వర్గాలు ఈ కీలక ప్రకటన చేశాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా ఆదాయం పొందిన వ్యక్తులకు సంబంధించి కోల్‌కతాలో దాడులు చేపట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన ఐ- ప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. భారీ సంఖ్యలో పోలీసు అధికారులతో డైరెక్టర్ నివాసంలోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ పరికరాలు, పలు దస్త్రాలతో సహా కీలక ఆధారాలు తీసుకెళ్లిపోయారని ఈడీ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈడీ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు కీలక ప్రకటన చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జాదవ్‌పూర్ 8బీ బస్టాండ్ నుంచి హజ్రామోర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారని.. దీనికి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తారని పేర్కొన్నాయి. ఈడీ చర్యను రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీని భయపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆరోపించాయి.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-government-official-events-lavish-menu-dttdc/
కాగా, ప్రతీక్ జైన్ నివాస ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, ఎన్నికల వ్యూహానికి సంబంధించిన సున్నితమైన డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీ ప్రయత్నిస్తోందని దీదీ ఆరోపించారు. అధికార పార్టీని వేధించడానికి కేంద్రం ఆదేశాల మేరకు ఈడీ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కాగా, ఐ- ప్యాక్.. టీఎంసీకి రాజకీయ సలహాలు అందించడంతో పాటు, ఆ పార్టీకి సంబంధించి ఐటీ, మీడియా కార్యకలాపాలను సైతం నిర్వహిస్తోంది.

