ఆర్థిక నిపుణులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని నివాసం వద్ద ఉంచారు. రేపు(శనివారం) ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ మృతికి నివాళిగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఇక ఇవాళ జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరగాల్సిన కేబినేట్ భేటీని వాయిదా వేశారు.
కాగా 1932 సెప్టెంబర్ 26న అఖండ భారతదేశంలో(ఇప్పటి పాకిస్థాన్ పంజాబ్)లోని గాహ్‌లో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ డాక్టరేట్ పొందారు. అనంతరం ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్‌గా, ఎకనామిక్ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు.