ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వీరిలో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు(Kesava Rao) అలియాస్ బసవరాజు కూడా మృతి చెందినట్లు తెలిపారు. అలాగే ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) వెల్లడించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. గతంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారిగా నంబాల కేశవరావు ఉన్నాడు.
‘‘నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలు రాయి విజయం. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో 27మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, నక్సల్ ఉద్యమానికి వెన్నెముకగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న మూడు దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి. భద్రతా బలగాలకు అభినందనలు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది’’ అని అమిత్ షా పేర్కొన్నారు. కాగా 2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత కేశవరావు పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు పీపుల్స్‌వార్ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై ఉద్యమంలో చేరారు.