Homeనేషనల్Maoist leaders: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ?.. ఎన్‌కౌంటర్‌ చేయొద్దంటూ కోర్టులో పిటిషన్‌

Maoist leaders: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ?.. ఎన్‌కౌంటర్‌ చేయొద్దంటూ కోర్టులో పిటిషన్‌

Maoist Top leaders Devji and Raji Reddy on Police Control: భూస్వామ్య వ్యతిరేక పోరాటాలతో రైతాంగ, కార్మిక ఉద్యమాలలో భాగమైన మావోయిస్టు పార్టీ ఎప్పుడూ లేనంతంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆపరేషన్‌ కగార్‌తో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు అగ్రనేతల ఎన్‌కౌంటర్‌, మరోవైపు వరుస లొంగుబాట్లతో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపునకు చేరుకుంది. కేంద్రం పెట్టిన డెడ్‌లైన్‌కు ముందే మావోయిస్టు పార్టీ అంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత, మోస్ట్‌ వాంటెడ్‌ హిడ్మా ఎన్‌కౌంటర్‌తో ఇక మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగినట్లే చెప్పవచ్చు. ఇక, మిగిలిన ఒకరిద్దరూ అగ్ర నేతలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు విశాఖలో పట్టుబడ్డ మావోయిస్టుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు రహస్య ప్రాంతంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 18న పోలీసులు దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డిలను నిర్బంధంలోకి తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారిని పోలీసులు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసే అవకాశం ఉందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్ రేపు హైకోర్టులో విచారణకు రానుంది.

- Advertisement -

హిడ్మా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ..

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర భద్రతా బలగాలు దండకారణ్య ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మావోయిస్టు పార్టీ టాప్ లీడర్, మోస్ట్ వాంటెడ్ హిడ్మా, ఆయన భార్యతో సహా అంగరక్షకులు ఆరుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. చత్తీస్‌ఘడ్‌లో నిర్భందం పెరిగిపోవడంతో ఆంధ్ర మీదుగా ఒడిస్సా వెళుతున్న క్రమంలో ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఇదిలా ఉండగా ఈ నెల 28 నుంచి 30 వరకు దేశంలో మావోయిస్టుల ఏరివేత, ఆపరేషన్ కగార్, టెర్రరిస్ట్ దాడుల ఎజెండాతో ఆల్ ఇండియా డీజీపీల సమావేశం జరగనుంది. అప్పటిలోపే మావోయిస్టుల ఏరివేత పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ముప్పేట దాడికి ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టు కేంద్ర బలగాలు అడవుల్లో అణువణువూ జల్లెడ పడుతున్నాయి. మరోవైపు అగ్రనేతలు పోలీసుల అదుపులో ఉన్నారనే ప్రచారంతో పౌరహక్కుల సంఘాలు అప్రమత్తమయ్యాయి. కనీసం మిగిలిన ఒకరిద్దరూ నేతలనైన ప్రాణాలతో కాపాడుకోవాలనే ఆశతో ఆయా సంఘాలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. అయితే, పోలీసులు వారిని అరెస్ట్‌ చేస్తారా? లేదా ఎప్పటిలాగే ఎన్‌కౌంటర్‌ చేస్తారా అనే విషయంపై సస్పెన్స్‌ నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News