Maoists Surrender in Chhattisgarh: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ధాటికి మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులైన 63 మంది నక్సలైట్లు దంతేవాడ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ్ రాయ్ సమక్షంలో తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన వారిలో కీలక నేతలు ఉండటం గమనార్హం. పోలీసుల ఎదుట లొంగిపోయిన మొత్తం 63 మందిలో 36 మందిపై ప్రభుత్వం గతంలో భారీ రివార్డులను ప్రకటించింది. వీరిపై ఉన్న మొత్తం రివార్డు విలువ సుమారు రూ. 1.19 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. దంతెవాడ జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) కార్యాలయంలో ఈ లొంగుబాటు కార్యక్రమం జరిగింది. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిసేలా మావోయిస్టులను ప్రోత్సహించేందుకు దంతెవాడ పోలీసులు చేపట్టిన ‘పున మర్గం’ ప్రచారమే ఈ భారీ లొంగుబాటుకు కారణమని అధికారులు వెల్లడించారు. డీఆర్‌జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్పీఎఫ్ బలగాలు వీరిని లొంగిపోయేలా చర్చలు జరిపాయి. వీరు లొంగిపోవడంలో చేయడంలో కీలక పాత్ర పోషించాయి.
నక్సల్ రహిత ప్రాంతంగా బస్తర్..
కాగా, లొంగిపోయిన వారిలో దర్భా డివిజన్, దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, మాడ్ డివిజన్లతో పాటు ఒడిశాలో పనిచేసిన మావోయిస్టు కీలక నేతలు కూడా ఉన్నారు. వీరిలో డివిజనల్ కమిటీ సభ్యులు మోహన్ కడ్తీ, సుమిత్రా కడ్తీ, పీపుల్స్ పార్టీ కమిటీ సభ్యురాలు హంగీ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరిపై గతంలో అనేక దాడులు, హత్యలు, ఐఈడీ పేలుళ్లు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ నక్సల్ పునరావాస విధానం ప్రకారం, లొంగిపోయిన వారికి రూ.50 వేల తక్షణ సహాయంతో పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ, వ్యవసాయ భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు వివరించారు. ఈ లొంగుబాటు బస్తర్‌ను నక్సల్ రహిత ప్రాంతంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో భారీ విజయమని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల విరక్తి చెందడం, అంతర్గత వివక్ష, మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘లోన్ వర్రాటు’ (తిరిగి రండి) వంటి పునరావాస కార్యక్రమాల పట్ల నమ్మకంతో వీరు లొంగిపోయారు. హింసను వదిలి సాధారణ పౌరులుగా జీవించాలనుకుంటున్నట్లు వారు ఎస్పీకి వివరించారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్లోని సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్‌చవాన్ ఎదుట రెండ్రోజుల క్రితమే 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉండగా, వారందరిపై సుమారు రూ.64 లక్షల రివార్డు ఉంది.

