Masood Azhar location in PoK : “మసూద్ అజర్ ఎక్కడున్నాడో చెబితే, సంతోషంగా అరెస్టు చేసి అప్పగిస్తాం” – ఇవి ఇటీవలే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు. అయితే, ఈ మాటల వెనుక ఉన్నది నయవంచనే అని మరోసారి రుజువైంది. పాక్ ప్రభుత్వ అండతోనే ఆ ఉగ్రనక్క ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మకాం మార్చినట్లు భారత నిఘా వర్గాలు పక్కా సమాచారంతో బట్టబయలు చేశాయి. పాకిస్థాన్ ఆడుతున్నది డ్రామాయేనా.? పర్యాటక ప్రాంతాన్ని తన కొత్త స్థావరంగా ఎందుకు ఎంచుకున్నాడు..?
జైషే మహ్మద్ (JeM) అధినేత, భారతదేశం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన మసూద్ అజర్ తన స్థావరాన్ని మార్చాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గల బహవల్‌పుర్‌లోని తన సురక్షిత కోటను వదిలి, ఏకంగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీఓకేలోని గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతానికి పారిపోయాడు.
పర్యాటక ప్రాంతంలో పక్కా ప్లాన్: నిఘా వర్గాల సమాచారం ప్రకారం, మసూద్ అజర్ ప్రస్తుతం పీఓకేలోని స్కర్డు పట్టణంలో, సద్‌పారా రోడ్ ఏరియాలో నక్కి ఉన్నాడు. ఈ ప్రాంతం అందమైన సరస్సులు, ఉద్యానవనాలతో నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతుంటుంది. ఇక్కడ అనేక ప్రభుత్వ, ప్రైవేటు గెస్ట్ హౌస్‌లు, మసీదులు, మదర్సాలు ఉన్నాయి. ఎవరికీ అనుమానం రాకూడదనే పక్కా ప్లాన్‌తో, జనసంచారంలో కలిసిపోయేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2019 బాలాకోట్ దాడుల తర్వాత కూడా అజర్ తన మకాంను బహవల్‌పుర్ నుంచి పెషావర్‌కు మార్చాడు. ఇప్పుడు మరోసారి అదే ఎత్తుగడ వేశాడు. అతని ప్రతి కదలికను భారత ఏజెన్సీలు నిశితంగా గమనిస్తున్నాయి.
తప్పుడు ప్రచారం, దాడి భయం: మరోవైపు, జైషే మహ్మద్ సోషల్ మీడియా విభాగం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. మసూద్ అజర్ ఇంకా బహవల్‌పుర్‌లోనే ఉన్నట్లు నమ్మించడానికి, అతని పాత ఆడియో క్లిప్పులను విడుదల చేస్తోంది. ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత దళాలు బహవల్‌పుర్‌లోని జైషే ప్రధాన కార్యాలయంపై దాడి చేసి, అజర్ కుటుంబసభ్యులతో సహా పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ దాడితో భయపడిపోయిన అజర్, ప్రాణరక్షణ కోసం తన స్థావరాన్ని మార్చాడని స్పష్టమవుతోంది.
మసూద్ అజర్ ఉగ్ర చరిత్ర : అంతర్జాతీయ ఉగ్రవాది: ఐక్యరాజ్యసమితి, అమెరికా, భారత్ ఇతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాయి.
విమానం హైజాక్: 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు, ప్రయాణికులకు బదులుగా ఇతడిని విడిపించుకున్నారు.
జైషే ఏర్పాటు: జైలు నుంచి విడుదలైన వెంటనే ‘జైషే మహ్మద్’ ఉగ్రసంస్థను స్థాపించాడు.
భారత్‌పై దాడులు: 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్‌కోట్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడికి ఇతడే సూత్రధారి. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.


