Kerala Explosion in Fireworks: కొన్ని రోజల వ్యవధిలోనే మరో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం టపాసుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం కారణంగా ఆరుగురు దుర్మరణం చెందారు. సుమారు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేసవి కాలం మొదలవ్వగానే బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ పేలుళ్లు, మంటల ధాటికి కార్మికులు సజీవదహనమవుతున్నారు. టపాసుల తయారీలో ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసినా.. పొట్టకూటి కోసం పనిచేయక తప్పడం లేదు. కానీ దాని ఫలితంగా అయినవారికి వారి ఆఖరి చూపు కూడా దక్కడం లేదు. అగ్నికీలలకు నిలువెల్లా కాలిపోయి బూడిదను తమ కష్టార్జితంగా ఇస్తున్నారు.
రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని వేట్లపాలెంలో జరిగిన ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండ్రోజుల క్రితం తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడుతో 18 మంది కార్మికులు మృతి చెందారు. పేలుడు ధాటికి 10 కి.మీ మేర భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఈ విషాదం.. కార్మికులను కలవరపెడుతోంది.
Also Read: https://teluguprabha.net/telangana/ban-on-transfers-of-government-employees-lifted-in-telangana/
వేసవి తీవ్రత నేపథ్యంలో మున్ముందు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

