మహారాష్ట్ర(Maharastra)లో ఘోర ప్రమాదం జరిగింది. భండారా జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో(Factory Blast) భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు ప్లాంట్ పైకప్పు కూలిపోయింది. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. భారీగా పొగ, మంటలు ఎగిసిపడుతున్నాయి. శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దాదాపు 12 మంది వర్కర్లు విధుల్లో ఉన్నారని.. ఇద్దరిని రక్షించామని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.