SBL Energy Limited industry: మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. కటోల్‌లోని ఎస్‌బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్ అనే పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 15 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
తెల్లవారుజామున భారీ పేలుడు: శనివారం తెల్లవారుజామున కటోల్‌లోని ఎస్‌బీఎల్ (SBL) ఎనర్జీ లిమిటెడ్ పరిశ్రమలోని ఒక యూనిట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలోని వివిధ విభాగాల్లో సుమారు 30 మందికి పైగా ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. ఈ పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు మరియు భూకంప పరిశోధనల్లో వాడే అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్థాలను తయారు చేస్తారు. ఒక యూనిట్‌లో జరిగిన అకస్మాత్తు విస్ఫోటనం ఫ్యాక్టరీ అంతటా తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
శిథిలాల కింద బాధితులు: పేలుడు ధాటికి భవనం కొంత భాగం కుప్పకూలింది. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

