Massive Fire At Rajya Sabha Mps Apartments In Delhi And Video Goes Viral: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎంపీల నివాస సముదాయమైన బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంట పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. కాగా, మధ్యాహ్నం 1:20 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని బిషంబర్ దాస్ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖ అధికారులు దాదాపు 14 ఫైర్ ఇంజిన్లను ఘటనా స్థలానికి పంపించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోని ఒక అంతస్తులో మంటలు మొదలై వేగంగా వ్యాపించాయి. ఈ నివాస సముదాయం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కేటాయించిన ఫ్లాట్లతో కూడిన బహుళ అంతస్తుల భవనం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అత్యంత వేగంగా సహాయక చర్యలను చేపట్టారు. దాదాపు ఒక గంటకు పైగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారి భూపేందర్ తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఒకే ఫ్లాట్‌కు చెందిన భార్యాభర్తలు, ఒక చిన్నారితో సహా కొందరికి కాలిన గాయాలైనట్లు సమాచారం. వారిని వెంటనే రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాల విమర్శలు..
కాగా, బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్ సముదాయం అత్యంత సున్నితమైన ప్రాంతంలో, పార్లమెంట్ భవనం నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో, రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి ఎదురుగా ఉంది. అనేక మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ప్రభుత్వం ఇందులో ఫ్లాట్లను కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2020 సంవత్సరంలో ఈ భవనాన్ని ప్రారంభించారు. తాజా అగ్నిప్రమాదంపై ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పించారు. ఎంపీలు నివసించే అత్యంత వీఐపీ ప్రాంతంలోనే అగ్నిమాపక భద్రతా లోపాలు ఉన్నాయంటే, ఢిల్లీలో సాధారణ భవనాల పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. సమయానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోలేదని, భవన నిర్వహణ ఏజెన్సీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అగ్నిప్రమాదం పార్లమెంట్ సభ్యుల నివాస ప్రాంగణంలో జరగడంతో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.


