Sunday, February 15, 2026
Homeనేషనల్MEA on US tariffs : సుంకాల వెనుక లాజిక్ లేదు - ట్రంప్ చర్య...

MEA on US tariffs : సుంకాల వెనుక లాజిక్ లేదు – ట్రంప్ చర్య ఏకపక్షం!

MEA on US tariffs : భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం భారీ సుంకాలపై భారత్ తొలిసారిగా అధికారికంగా, ఘాటుగా స్పందించింది. ఈ చర్య పూర్తిగా “ఏకపక్షం” అని, దీని వెనుక ఎలాంటి తర్కం గానీ, కారణం గానీ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ సుంకాల గోడల నడుమ కూడా ఇరు దేశాల మధ్య చర్చల ద్వారాలు మూసుకుపోలేదని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో, అగ్రరాజ్యంతో ఆగిపోయిన చర్చలు తిరిగి గాడిన పడతాయా..? ఈ సుంకాల ప్రభావాన్ని తట్టుకోవడానికి భారత్ అనుసరించబోయే ప్రత్యామ్నాయ వ్యూహాలేమిటి?

- Advertisement -

 భారత దౌత్య వర్గాల స్పందన : ముంబయిలో జరిగిన లీడ్ బ్రెజిల్-ఇండియా ఫోరమ్ సందర్భంగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి దమ్ము రవి ఈ సుంకాల వివాదంపై భారత వైఖరిని స్పష్టం చేశారు.

 “ఇది ఏకపక్ష చర్య.. లాజిక్ లేదు”: “ఈ సుంకాల విధింపు పూర్తిగా ఏకపక్ష నిర్ణయం. దీని వెనుక ఎలాంటి కారణం, లాజిక్ లేదన్నది నా అభిప్రాయం. బహుశా ఇది ఒక తాత్కాలిక దశ కావచ్చు,” అని దమ్ము రవి పేర్కొన్నారు. ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేయడానికి ముందు, ఇరు పక్షాలు ఒక పరిష్కారానికి చాలా దగ్గరగా వచ్చాయని, కానీ ఈ నిర్ణయంతో చర్చలు తాత్కాలికంగా ఆగిపోయాయని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ చర్చలు తిరిగి కొనసాగుతాయని, ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలంగా ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారత పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదు: ఈ భారీ సుంకాలు భారత పరిశ్రమను కుంగతీయలేవని దమ్ము రవి ధీమా వ్యక్తం చేశారు. “ఈ సుంకాలు మన పరిశ్రమను వెనక్కి లాగవు. ఒక దేశ ఎగుమతులకు సుంకాల గోడలు కడితే, అది వ్యాపారం చేయగలిగే కొత్త మార్కెట్ల కోసం చూస్తుంది. అమెరికాకు ఎగుమతి చేయడం కష్టమైతే, మేం ఇతర అవకాశాలను అన్వేషిస్తాం,” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి: భారత్ తన ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారిస్తుందని రవి తెలిపారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మరియు దక్షిణాసియా దేశాలు భారత లక్ష్యిత ప్రాంతాలని ఆయన పేర్కొన్నారు. “ఇది తాత్కాలిక సమస్యే. కాలక్రమేణా పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఒకే భావజాలం ఉన్న దేశాలు పరస్పర సహకారంతో దీనిని అధిగమిస్తాయి,” అని అన్నారు.

బ్రిక్స్ కరెన్సీపై స్పష్టత: ఈ సందర్భంగా బ్రిక్స్ కరెన్సీపై వస్తున్న ఊహాగానాలకు దమ్ము రవి తెరదించారు. అమెరికన్ డాలర్‌ను స్థానభ్రంశం చేయాలన్న ఉద్దేశం బ్రిక్స్ కరెన్సీకి లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, కొవిడ్ తర్వాత ఏర్పడిన కరెన్సీ కొరత నేపథ్యంలో, ద్వైపాక్షిక వాణిజ్యం కోసం స్థానిక కరెన్సీలను ఉపయోగించుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై బ్రిక్స్ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News