Meet Bihar’s ‘Mushroom Lady’ Bina Devi: బీహార్‌లోని ముంగేర్ జిల్లా, టిల్కారీ అనే ఓ మారుమూల గ్రామంలో పూట గడవడమే గగనంగా ఉన్న దుర్భర పేదరికం. సాగు చేయడానికి భూమి లేదు, పెట్టుబడికి డబ్బు లేదు. నలుగురు పిల్లల కడుపు నింపడానికి ఆ తల్లి పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. అలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ చేసిన వినూత్న ఆలోచన, ఆమెనే కాదు, తన చుట్టూ ఉన్న 70,000 మంది మహిళల జీవితాలను మార్చేసింది. ఆమే బినా దేవి, నేడు దేశవ్యాప్తంగా “మష్రూమ్ లేడీ”గా ప్రఖ్యాతి గాంచిన స్ఫూర్తి ప్రదాత.
మంచం కింద మొదలైన ప్రస్థానం
భర్త గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రోజుల్లో, బినా దేవి పేదరికంపై పోరాటానికి సిద్ధమైంది. వ్యవసాయానికి భూమి లేకపోవడంతో, తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో చేయగల పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకుంది. కేవలం ఒక కిలో పుట్టగొడుగుల విత్తనాలతో, తను పడుకునే మంచం కిందనే తన ప్రయోగాన్ని ప్రారంభించింది. మొదట్లో సరైన అవగాహన లేక, ఉష్ణోగ్రత, తేమ వంటివి నియంత్రించలేక తీవ్రంగా నష్టపోయింది. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. భాగల్‌పూర్‌లోని బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి మెళకువలు నేర్చుకుని, పట్టుదలతో మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించింది.
విజయం నుంచి ఉద్యమం వైపు
ఆమె కష్టానికి ఫలితం దక్కింది. పుట్టగొడుగుల ఉత్పత్తి పెరిగి, స్థానిక మార్కెట్లో కిలోకు రూ. 200 నుంచి రూ. 300 వరకు ధర పలకడంతో ఆమె ఆదాయం ఏకంగా లక్షలకు చేరింది. దీంతో ఆమె కుటుంబ ఆర్థిక కష్టాలు తీరాయి, పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు. అయితే, ఆ విజయాన్ని తనకే పరిమితం చేసుకోలేదు బినా దేవి. తనలాంటి ఎందరో గ్రామీణ మహిళలకు ఈ మార్గాన్ని చూపాలనుకుంది.
చుట్టుపక్కల గ్రామాల్లోని మహిళలకు పుట్టగొడుగుల పెంపకంపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి, వందలాది గ్రామాల్లోని మహిళలు ఆమె దగ్గర శిక్షణ పొందారు. “మహిళ ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడు, ఆమెలో ఆత్మగౌరవం పెరుగుతుంది. కుటుంబంలో, సమాజంలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది,” అని బినా దేవి గర్వంగా చెబుతారు. నేడు ఆమె చొరవతో 60,000 నుంచి 70,000 మంది మహిళలు పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఉపాధి పొందుతూ, తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు.
ALSO READ: Gayatri Projects: సుబ్బిరామి రెడ్డికి బిగ్ రిలీఫ్.. ఆయన కంపెనీకి రూ. 5700 కోట్ల రుణం మాఫీ..!
జాతీయ గుర్తింపు, ఆగని పోరాటం
బినా దేవి సేవలను గుర్తించి 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెను సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆమె కథను ప్రశంసించారు. “ప్రధానిని, రాష్ట్రపతిని కలిసినప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను. వారి కోసం నేను పండించిన పుట్టగొడుగులతో పాటు, కొన్ని పిండివంటలు, పచ్చళ్లు కూడా తీసుకెళ్లాను,” అని ఆమె ఆనందంగా గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం ఆమె సేంద్రియ వ్యవసాయంపై కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంత జాతీయ గుర్తింపు వచ్చినా, ప్రభుత్వ పథకాల నుంచి తనకు ప్రత్యక్షంగా ఎలాంటి సహాయం అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి మహిళలకు ప్రభుత్వ ఉపాధి పథకాలు అందేలా చూడాలని ఆమె ప్రధానికి, బీహార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఒకప్పుడు “ఈమెకో పిచ్చిది” అని ఎగతాళి చేసిన వాళ్లే, ఇప్పుడు గౌరవించే స్థాయికి ఎదిగిన బినా దేవి కథ, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి నిలువుటద్దం.


