Thursday, March 12, 2026
Homeనేషనల్Coal Mine : మేఘాలయ గనిలో మృత్యుఘోష.. 27కు చేరిన మృతుల సంఖ్య!

Coal Mine : మేఘాలయ గనిలో మృత్యుఘోష.. 27కు చేరిన మృతుల సంఖ్య!

Meghalaya illegal coal mining tragedy : నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక్కసారిగా పేలిన మందుపాతర.. పచ్చని కొండల్లో నెత్తుటి ధారలు.. వెలుగు కోసం చేసే అన్వేషణలో గని కార్మికుల జీవితాలు శాశ్వతంగా చీకటిలో కలిసిపోయాయి. మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో సంభవించిన ఘోర ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. శనివారం మరో రెండు మృతదేహాలు లభ్యం కావడంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. అసలు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల వెనుక ఉన్న ‘పెద్దలు’ ఎవరు? ప్రాణాలను పణంగా పెట్టి ఈ నరక కూపాల్లోకి కార్మికులను నెడుతున్నదెవరు?

- Advertisement -

అడుగడుగునా ప్రమాదం : ఈనెల 5వ తేదీ  ఉమ్స్నాగట్ గ్రామంలోని థాంగ్స్కు ప్రాంతంలో ఉన్న ఒక అక్రమ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న రాట్-హోల్  మైనింగ్ పద్ధతిలో బొగ్గును వెలికితీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. శనివారం ఉదయం నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేసిన మల్టీ-ఏజెన్సీ సెర్చ్ టీమ్స్, శిథిలాల కింద చిక్కుకున్న మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. దీంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

చట్టం ఉచ్చులో నిందితులు : ఈ దారుణ ఘటనపై స్పందించిన మేఘాలయ పోలీసులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జలపేట్ పోర్డంగ్ గ్రామానికి చెందిన ఫోర్మే చిర్మాంగ్ (36), సుత్ంగా పోవైలాంగ్ గ్రామానికి చెందిన షమేహి వార్ (42)లను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ఈ అక్రమ గని నిర్వహణలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. “తీగ లాగితే డొంక కదిలినట్లు” ఈ అరెస్టులతో మైనింగ్ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

అక్రమ తవ్వకాలు.. ఆగని మరణాలు : జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నిషేధం విధించినప్పటికీ, మేఘాలయలోని మారుమూల ప్రాంతాల్లో అక్రమ బొగ్గు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించాలనే యజమానుల దురాశకు సామాన్య కార్మికులు బలైపోతున్నారు. రక్షణ కవచాలు లేవు, కనీస భద్రతా ప్రమాణాలు పాటించరు. కేవలం ఒక ఇరుకైన రంధ్రం ద్వారా గనిలోకి దిగే కార్మికులు, తిరిగి ప్రాణాలతో వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

సహాయక చర్యలు ముమ్మరం : ప్రస్తుతం ప్రమాద స్థలంలో రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) మరియు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. గని లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో డ్రోన్లు మరియు అధునాతన యంత్రాలను వినియోగిస్తున్నారు. బాధితుల కుటుంబాలు తమ వారి కోసం గని వెలుపల కన్నీరుమున్నీరవుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News