Customs duty on luxury cars in India : విలాసవంతమైన కార్లపై విధిస్తున్న అధిక కస్టమ్స్ సుంకాల భారాన్ని తగ్గించాలని, పన్నుల విధానాన్ని హేతుబద్ధీకరించాలని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సుంకాలు తగ్గిస్తే, ప్రీమియం సెగ్మెంట్‌లో అమ్మకాలు పెరిగి, అంతిమంగా ప్రభుత్వానికే అధిక పన్నుల రూపంలో ఆదాయం వస్తుందని ఆ సంస్థ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. రాబోయే కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు, ఆటోమొబైల్ రంగంలో చర్చకు దారితీశాయి.
రాబోయే కేంద్ర బడ్జెట్ నుంచి ఆశిస్తున్న అంశాలపై, మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ… దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై ఉన్న పన్నుల విధానంపై ఆయన కీలక సూచనలు చేశారు.
పన్నుల విధానంపై అయ్యర్ సూచనలు
సుంకాల హేతుబద్ధీకరణ: “ప్రస్తుతం, దిగుమతి చేసుకునే కార్లపై 70%, 110% అంటూ వేర్వేరు కస్టమ్స్ సుంకాలు ఉన్నాయి. ఈ విధానాన్ని హేతుబద్ధీకరించి, ఒకే శ్లాబు కిందకు తీసుకురావాలి. జీఎస్టీ 2.0 తరహాలోనే, కస్టమ్స్ సుంకాల్లోనూ సంస్కరణలు అవసరం,” అని ఆయన అన్నారు.
ప్రభుత్వానికే లాభం: “మేం అమ్మే కార్లలో కేవలం 5-8% మాత్రమే దిగుమతి చేసుకుంటాం. ఇవి మాస్ మార్కెట్‌ను ప్రభావితం చేయవు. కాబట్టి, సుంకాలను తగ్గిస్తే, అమ్మకాలు పెరిగి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరింత ఆదాయం వస్తుంది. రోడ్లపైకి మరిన్ని మంచి కార్లు వస్తాయి,” అని ఆయన వివరించారు.
రూపాయి పతనం.. పెరుగుతున్న ధరలు : రూపాయి విలువ పడిపోవడం కూడా లగ్జరీ కార్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోందని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి పతనం వల్ల, దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు పెరిగి, కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని, ఇది అమ్మకాలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. 2026లో ప్రతి త్రైమాసికానికి కార్ల ధరలను 2% పెంచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. “బడ్జెట్‌లో మెరుగైన ద్రవ్య నిర్వహణ చర్యలు చేపట్టి, రూపాయి పతనాన్ని అరికడితే, మా పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుంది,” అని ఆయన అన్నారు.
రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేయాలి : దేశంలో మెరుగైన రోడ్ల మౌలిక సదుపాయాలు, లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధికి దోహదపడతాయని అయ్యర్ అభిప్రాయపడ్డారు. బడ్జెట్‌లో రోడ్ల నిర్మాణానికి అధిక కేటాయింపులు చేయాలని ఆయన కోరారు. మొత్తం మీద, పన్నుల హేతుబద్ధీకరణ, స్థిరమైన ఆర్థిక విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు.. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తే, భారత లగ్జరీ కార్ల మార్కెట్ మరింతగా వృద్ధి చెందుతుందని సంతోష్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశారు.

