HomeTop StoriesMeta : బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే..! 'మెటా' అధినేత జుకర్‌బర్గ్‌కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!

Meta : బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే..! ‘మెటా’ అధినేత జుకర్‌బర్గ్‌కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక!

Meta PM Modi video takedown controversy : దేశంలో నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువతకు అండగా ఉంటామని హామీ ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ రీల్స్/వీడియో ద్వారా సందేశమిచ్చారు. అయితే, జులై చివరి వారంలో ఈ పోస్టు ఫేస్‌బుక్ నుంచి దాదాపు 5 నుంచి 6 గంటల పాటు మాయమైంది.

- Advertisement -

కోట్లాది మంది వినియోగదారులకు ఈ వీడియో అందుబాటులో లేకుండా పోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై మెటా స్పందిస్తూ— ఇది తమ ఆటోమేటెడ్ ఫిల్టరింగ్ సిస్టమ్‌లో దొర్లిన సాంకేతిక లోపం  మాత్రమేనని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయితే, కేంద్ర సమాచార ప్రసార, ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ వివరణను తీవ్రంగా తోసిపుచ్చింది. దేశ ప్రధాని ధ్రువీకరించిన  ఖాతా నుంచి వచ్చిన పోస్టుకే ఇలాంటి గతిపడితే సాధారణ పౌరుల భద్రత ఏమిటని కేంద్రం కడిగిపారేసింది.

ఢిల్లీ వేదికగా సుదీర్ఘ మంథనం: నిలదీసిన కేంద్ర ఐటీ శాఖ : ఈ వివాదం తారస్థాయికి చేరడంతో మెటా గ్లోబల్ అఫైర్స్ చీఫ్ జోయెల్ కాప్లన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఢిల్లీకి చేరుకుంది. బుధవారం కేంద్ర ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో మెటా బృందం సుదీర్ఘంగా సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం మెటా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు అంశాలపై నిలదీసింది.

చిన్నారుల భద్రత (CSAM): ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ ప్రకటనల రూపంలో చిన్నారుల లైంగిక దుర్వినియోగ కంటెంట్  వ్యాప్తి చెందడాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలను అరికట్టడంలో మెటా వద్ద ఉన్న సాంకేతిక వ్యవస్థలు ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించింది. కొంతమందికి చెందిన కంటెంట్‌ను విపరీతంగా ప్రమోట్ చేయడానికి మెటా పెద్దమొత్తంలో నిధులు ఖర్చు చేస్తోందనే విషయాన్ని ప్రభుత్వం ఆధారాలతో సహా ముందుంచగా, మెటా ప్రతినిధులు ఈ విషయాన్ని అంగీకరించి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ లోపాలన్నింటికీ బాధ్యత వహిస్తూ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తరఫున ప్రతినిధులు క్షమాపణలు తెలిపినట్లు తెలుస్తోంది.

సేఫ్ హార్బర్’ రక్షణ ఊడేనా? చట్టపరమైన బిగింపు : సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెటా ప్రతినిధులకు ఒక స్పష్టమైన చట్టపరమైన హెచ్చరిక జారీ చేసింది. సమాచార సాంకేతిక చట్టం (IT Act) సెక్షన్ 79 ప్రకారం సోషల్ మీడియా వేదికలకు ‘సేఫ్ హార్బర్’ (Safe Harbour) రక్షణ లభిస్తుంది. అంటే యూజర్లు పెట్టే కంటెంట్‌కు ప్లాట్‌ఫామ్ నేరుగా బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.

మెటా కేవలం సమాచార మార్పిడి వేదిక మాత్రమే కాదు. ఏ కంటెంట్‌ను ఎవరికి చూపించాలో ప్లాట్‌ఫామ్ అల్గారిథమ్ ద్వారా స్వయంగా నిర్ణయిస్తోంది. కంటెంట్ ప్రమోషన్లు, ప్రధాని వంటి ప్రముఖుల పోస్టుల నిరోధంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నందున, మెటాను పబ్లిషర్ గానే పరిగణించాల్సి వస్తుంది. ఫలితంగా, నిబంధనలు పాటించకపోతే ‘సేఫ్ హార్బర్’ రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది.

పార్లమెంటరీ కమిటీ అల్టిమేటమ్: 3 రోజుల్లో బహిరంగ క్షమాపణ : ఇటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ) అధినేత నిషికాంత్ దూబే నేతృత్వంలో జరిగిన సమావేశం మెటాపై మరింత కఠిన వైఖరి అవలంబించింది. ప్రధాని వీడియోను 5 గంటల పాటు నిలిపివేయడం వెనుక వ్యవస్థల వైఫల్యం లేదా ప్రతిష్ఠకు భంగం కలిగించే యత్నం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 3 రోజుల్లోగా నిరభ్యంతర  బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో ఐటీ చట్టం సెక్షన్ 79 ప్రకారం మెటాకు ఉన్న చట్టపరమైన రక్షణను ఉపసంహరించి, వారిని నేరుగా ఒక పబ్లిషర్‌గా పరిగణించి చట్టపరమైన చర్యలు చేపడతామని లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశాల్లో పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News