Life Imprisonment: ఉత్తరప్రదేశ్ ని మొన్నటి దాకా తోడేళ్ల బెడద వణికించింది. దీంతో, ఆపరేషన్ బేడియా పేరుతో దానికి అక్కడి ప్రభుత్వం ముగింపు పలికింది. అయితే, ఇప్పుడు యూపీని వీధి కుక్కల బెడద కలవరపెడుతోంది. కాగా.. వీధి కుక్కల విషయంలో యోగి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కారణం లేకుండా మనుషులపై దాడి చేసే కుక్కల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఎవరైనా రెచ్చగొట్టకుండా ఒకసారి కరిచిన కుక్కను పది రోజుల పాటు పరిశీలనలో ఉంచి, అదే కుక్క రెండోసారి కూడా దాడి చేస్తే జీవితాంతం యానిమల్ సెంటర్‌లోనే నిర్బంధించాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 10న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమృత్ అభిజత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనల ప్రకారం వీధి కుక్క కరిచిన తర్వాత ఎవరైనా యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ ఘటనపై అధికారులు విచారణ జరుపుతారు. వెంటనే ఆ కుక్కను సమీపంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రానికి తరలిస్తారు.
Read Also: Chandrababu: ఏపీలో బెల్ట్ షాపులు ఇక కన్పించవు.. వందశాతం డిజిటల్ చెల్లింపులే.. సీఎం బాబు కీలక నిర్ణయం
మైక్రోచిప్..
ఈ ప్రక్రియపై ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ పశువైద్యాధికారి డాక్టర్ బిజయ్ అమృత్ రాజ్ మాట్లాడుతూ “ఏబీసీ కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత కుక్కకు స్టెరిలైజేషన్ చేయనట్లయితే, ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. దానిని 10 రోజుల పాటు పరిశీలనలో ఉంచి ప్రవర్తనను గమనిస్తాం. విడుదల చేసే ముందు దానికి ఒక మైక్రోచిప్ అమరుస్తాం. దాని ద్వారా కుక్క వివరాలు, అది ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు” అని వివరించారు. అదే కుక్క రెచ్చగొట్టకుండా రెండోసారి మనిషిపై దాడి చేస్తే దానిని జీవితాంతం కేంద్రంలోనే ఉంచుతారు. అయితే దాడికి రెచ్చగొట్టే చర్యలు జరిగాయా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించడానికి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో స్థానిక పశువైద్యుడు, జంతువుల ప్రవర్తనపై అవగాహన ఉన్న నిపుణుడు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. “ఎవరైనా రాయి విసిరిన తర్వాత కుక్క కరిస్తే, దానిని రెచ్చగొట్టినట్టుగానే పరిగణిస్తారు” అని అధికారులు స్పష్టం చేశారు.
దత్తత తీసుకునేలా..
ఇలా నిర్బంధంలో ఉన్న కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. కానీ, వారు తమ పూర్తి వివరాలు అందించి, ఆ కుక్కను మళ్లీ వీధుల్లోకి వదిలిపెట్టబోమని అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ దత్తత తీసుకున్న వారు కుక్కను బయట వదిలేస్తే, వారిపై కఠిన చర్యలు తీసకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే, దేశంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లోని వీధి కుక్కల విషయంలో ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Read Also: Viral Video: వామ్మో బుడ్డోడు ఇలా ఉన్నాడేంట్రా.. రెండు చేతుల్లో పాములు పట్టుకుని హల్చల్


