MIM Plays Key Role in Bihar Second Phase Elections: బీహార్‌లో నవంబర్ 6న మొదటిదశ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. మంగళవారం రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగున్నాయి. మొదటి దశలో మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి దశలో దాదాపు 64.66 శాతం ఓటింగ్ నమోదైంది. 2020లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి 8 శాతం అధికంగా ఓటింగ్ నమోదైంది. ఇక, రెండో దశలో 20 జిల్లాల్లో మిగిలిన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం నిన్న (నవంబర్ 9)న ముగిసింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమీ, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంది. మొదటి దశలో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి పోటీచేస్తున్న తారాపూర్ నియోజకవర్గం, అలాగే ఆర్జేడీ నేత, మహాగఠ్‌బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ బరిలోకి దిగిన రాఘోపూర్ నియోజకవర్గంలో ఎన్నికలు ముగిశాయి. ఇక, రెండో దశలో బీజేపీ సీనియర్ నేత ప్రేమ్‌కుమార్ పోటీ చేస్తున్న గయా టౌన్ నియోజకవర్గం కూడా ఉంది. అలాగే, సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా అయిన నలందలో కూడా రెండో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇది నితీశ్ కుమార్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఓటింగ్ సరళి, ఎన్నికల ఫలితంపై ఆసక్తి నెలకొంది.
రెండో దశలో కీలకంగా మారిన ఎంఐఎం..
ఈ రెండో దశ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయనున్న స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. సీమాంచల్ జిల్లాలోనే కిషన్‌గంజ్, పూర్ణియా, కటిహార్, అరారియా వంటి నియోజకవర్గాల్లో ఎంఐఎం బరిలోకి దిగుతోంది. మొత్తంగా 25 స్థానాల్లో ఈ పార్టీ పోటీ చేయనుండగా.. ఇవి ఎక్కువ భాగం రెండో దశ పోలింగ్‌లో జరిగే సీమాంచల్ ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో ఈ రెండో దశలో అధికార, విపక్ష పార్టీల ఓట్లను ఎంఐఎం చీల్చే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఐఎం సీమాంచల్ ప్రాంతంలోనే 5 స్థానాలను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ఈసారి కూడా ఆ ప్రాంతంలో పట్టు సాధిస్తుందా అనేదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికారం కోసం ఎన్డీయే, మహాగఠ్ బంధన్ కూటములు మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. ఇరు పక్షాలు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలు ప్రకటించాయి. మరి బీహార్ ప్రజలు ఈసారి ఎవరికి అధికార పీఠం అప్పగిస్తారో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రెండో దశ పోలింగ్ కోసం అధికారులు అన్ని సిద్ధం చేశారు. 122 స్థానాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 1300 అభ్యర్థులు పోటీ చేయనున్నారు. దాదాపు 4 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండో దశ ఎన్నికలే అధికారం ఎవరికి దక్కనుందో నిర్ణయిస్తాయి. మరీ బీహార్‌లో గెలిచేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


