Minister Rammohan Naidu fires at Indigo Airlines: దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఇండిగో విమానాల వల్ల ప్రజలు నానా పాట్లూ పడుతున్నారు. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ప్రయాణికులు నిరసనతో దాదాపు అన్ని ఎయిర్ పోర్టులు రణరంగంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక విమానాలు రద్దవ్వగా.. మరికొన్ని చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇండిగో నిర్లక్ష్యమే కారణమా?
ఇటీవల ఇండిగో విమాన సంస్థ ఎఫ్‌డీటీఎల్ నిబంధనలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం, పైలట్లు, సిబ్బందికి వారాంతపు సెలవును 36 గంటల నుంచి 48 గంటలకు పెరిగింది. నవంబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అలాగే రాత్రి సమయాల్లో ల్యాండింగ్స్‌ను పరిమితం చేస్తూ నిబంధనలు మార్చారు. అయితే, ఇవన్నీ నవంబర్ నుంచే అమల్లోకి వచ్చాయి. మిగతా విమానయాన సంస్థలన్నీ కొత్త రూల్స్ ప్రకారం అన్ని సర్దుబాట్లు చేసుకున్నాయి. తమ విమానాల డ్యూటీ పరిమితుల నిబంధనలకు అనుగుణంగా మార్చుకున్నాయి. కానీ ఇండిగో సంస్థ మాత్రం నిబంధనలు మార్చడంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో ఒక్కసారిగా సిబ్బంది విధులకు రావడం మానేశారు. దీంతో, విమానాలను రద్దు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితిపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇండిగో సంస్థనే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ఇండిగో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు.
అన్ని చర్యలూ తీసుకుంటున్నాం..
అయితే, పరిస్థితులు తొందరలోనే మెరుగుపడతాయని ప్రయాణికులకు ఆయన హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారమయ్యే దిశ అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ అమౌంట్ రీఫండ్ చేస్తున్నామని, కొన్ని విమానాశ్రయాల్లో రీఫండ్ పూర్తయ్యిందని, మిగిలినవి కూడా ఈ రోజు రాత్రికి పూర్తవుతాయని తెలిపారు. రేపటి నుంచి ఇండిగో పరిమిత సామర్థ్యంతో ఎటువంటి సమస్యలూ లేకుండా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఇండిగో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీనికి కొన్ని రోజులు పడుతుందని.. అప్పటి వరకు ప్రయాణికులు ఓపిగ్గా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇండిగో తప్పిదంలో విమానయాన శాఖ, లేదా డీజీసీఏ తప్పు లేదని.. తాము నిరంతరం విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని.. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గత వారం ఎయిర్‌బస్ A320 లకు అప్‌డేట్‌ను తప్పనిసరి చేసిందని.. 323 విమానాలకు ఎటువంటి అంతరాయాలు లేకుండా తక్కువ సమయంలోనే అది పూర్తయిందని మంత్రి రామ్మోహన్ తెలిపారు. ఇండిగో తప్పిదాలపై విచారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

