Chasing Cricket Dreams : సూరత్: “అమ్మా, నాన్నలకు బై.. నా కలలను నెరవేర్చుకునేందుకు వెళ్తున్నాను. మీరు బాధ పడకండి నేను మళ్లీ తిరిగి వస్తాను. కనీసం ఏడాది వరకు ఇంటికి తిరిగి రాను.” ఈ అక్షరాలు ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి తన తల్లిదండ్రులకు రాసిన లేఖలోనివి. క్రికెటర్ కావాలనే బలమైన ఆకాంక్షతో స్నేహితుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ చిన్నారుల ఆశ నెరవేరిందా? వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగింది? అసలు కథేంటో తెలుసుకుందాం.
హజిరా రోడ్‌లోని మోరా టెక్రా గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే ఇద్దరు ప్రాణ స్నేహితులు నవంబర్ 7వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హెయిర్ కటింగ్ కోసం బయటకు వెళ్లారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక బాలుడు చేతిలో క్రికెట్ బ్యాట్, భుజానికి బ్యాగుతో కనిపించాడు. అదే సమయం నుంచి అతని స్నేహితుడు కూడా కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులకు అనుమానం బలపడింది. వారిద్దరూ ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడుకుంటారని, పెద్దయ్యాక గొప్ప క్రికెటర్లు అవుతామని అనేవారని స్థానికులు చెప్పడంతో, పిల్లలు పారిపోయారని నిర్ధారించుకున్నారు.
మరుసటి రోజు ఇచ్ఛోపురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సూరత్ రైల్వే స్టేషన్‌లోని దాదాపు 93 సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, ఇద్దరు స్నేహితులు ముంబయి వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారు. అనంతరం బొరివలి స్టేషన్లో దిగి జైపుర్ వెళ్లే మరో రైలు పట్టుకున్నట్లు తేల్చారు. వెంటనే ఒక పోలీసు బృందం రాజస్థాన్‌కు బయలుదేరింది. అక్కడ భిల్వాడా సమీపంలో ఇద్దరినీ సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, ఇంట్లో ఎవరికీ చెప్పకుండానే క్రికెటర్లు కావాలనే లక్ష్యంతో పారిపోయినట్లు ఆ చిన్నారులు అంగీకరించారు. పోలీసులు వారిని సూరత్ తీసుకువచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నపేగు బంధాన్ని కాదని కలల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ చిన్నారులు, తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరడంతో కథ సుఖాంతమైంది.
గతంలోనూ ఇలాంటి ఘటనే : గతంలో దిల్లీలోనూ ఇలాంటి సంఘటనే వెలుగు చూసింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను కలవాలనే ఆశతో ముగ్గురు మైనర్లు ఇంట్లో చెప్పకుండా ముంబయికి బయలుదేరారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని మహారాష్ట్రలోని నాశిక్ రైల్వే స్టేషన్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా పరిచయమైన వాహిద్ అనే వ్యక్తి మాటలు నమ్మి వారు జల్నాకు బయలుదేరినట్లు పోలీసుల విచారణలో తేలింది.

