MK Stalin Slams Tamil Nadu Governor: తమిళనాడు సిద్ధ మెడికల్ యూనివర్సిటీ సవరణ బిల్లుపై గవర్నర్ ఆర్‌ఎన్ రవి చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తూ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. గవర్నర్ వ్యాఖ్యలు “రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య సూత్రాలకు వ్యతిరేకమని, సభ గౌరవాన్ని తగ్గించేలా” ఉన్నాయని స్టాలిన్ విమర్శించారు. ఈ బిల్లును ఆమోదం కోసం మళ్లీ గవర్నర్‌కు పంపాలని అసెంబ్లీ నిర్ణయించింది.
ALSO READ: CASTE SURVEY: కులగణన సర్వేకు నారాయణమూర్తి దంపతుల ‘నో’! “మేం వెనుకబడిన వారం కాదు”
సీఎంను ఛాన్సలర్‌గా మార్చే బిల్లు
సిద్ధ, ఆయుర్వేద, యునాని వంటి సంప్రదాయ వైద్య విధానాల కోసం ఏర్పాటు చేసిన తమిళనాడు సిద్ధ మెడికల్ యూనివర్సిటీ చట్టాన్ని సవరించడానికి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ సవరణలో కీలకమైన ప్రతిపాదన ఏమిటంటే, యూనివర్సిటీ ఛాన్సలర్ పాత్ర నుంచి గవర్నర్‌ను తొలగించి, ఆ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించడం.
ఈ బిల్లు ఆర్థిక బిల్లు (Finance Bill) పరిధిలోకి వస్తుంది కాబట్టి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 207(3) ప్రకారం, దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ సిఫార్సు అవసరం. అందుకే బిల్లును ముసాయిదా దశలోనే గవర్నర్‌కు పంపినట్లు స్టాలిన్ వివరించారు.
గవర్నర్ తీరుపై స్టాలిన్ అభ్యంతరం
“గవర్నర్ రాజ్యాంగ సంప్రదాయాలను పాటించకుండా, బిల్లును ప్రవేశపెట్టకముందే దానిలోని కొన్ని సెక్షన్లపై తన వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటిని సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని కోరడం రాజ్యాంగానికి, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధం” అని స్టాలిన్ అన్నారు. సవరణలు సూచించే హక్కు కేవలం ఎన్నికైన సభ్యులకు మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: BIHAR POLITICS: బిహార్‌లో పొత్తుల పంచాయితీ.. లాలూకు రాహుల్ ఫోన్! కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు!
గవర్నర్ తన నోట్‌లో ఉపయోగించిన “తగిన పరిశీలన (appropriate consideration)” అనే పదబంధంపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆ పదం మేము అక్రమంగా వ్యవహరించినట్లుగా లేదా సభ సక్రమంగా పనిచేయనట్లుగా సూచిస్తోంది. ఇది అంగీకారయోగ్యం కాదు. చట్టాలు చేసే అధికారం ఈ అసెంబ్లీకి మాత్రమే ఉంది” అని ముఖ్యమంత్రి గట్టిగా పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయాల్లో తన విచక్షణాధికారం ఉపయోగించకూడదని, మంత్రి మండలి సలహా మేరకు నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుంది.


