Rahil Sheikh Threaten Woman: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఇటీవలే దశాబ్దాల క్రితం విడిపోయిన ఠాక్రే సోదరులు తిరిగి కలిశారు. దీంతో మరాఠా రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమనే చర్చ మొదలైంది. ఈ చర్చ జరుగుతుండగానే రాజ్ ఠాక్రే స్థాపించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) పార్టీకి చెందిన ఓ కీలక నేత కుమారుడు ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. ఎంఎన్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ షేక్ మద్యం మత్తులో రెచ్చిపోయాడు. అర్థనగ్నంగా ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మరాఠీ భాషను, సంస్కృతిని కాపాడతామని చెప్పే వారి నిజ స్వరూపం ఇదేనంటూ మండిపడ్డారు. మద్యం మత్తులో అర్థనగ్నంగా ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఎంఎన్ఎస్ నేత కొడుకు మరాఠీ మహిళను దుర్భాషలాడాడని విమర్శించారు. అంతటితో ఆగకుండా తన తండ్రి రాజకీయ పలుకుబడిని ప్రదర్శించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాఠీల ఆత్మగౌరవం కాపాడతామంటూ గొప్పలు చెప్పుకునే వీరు ఏకంగా మరాఠీలపైనే రౌడీయిజం చేస్తున్నారని నిరుపమ్ ఫైర్ అయ్యారు.
Also Read: స్కూల్ బస్సుపై దూసుకెళ్లిన రైలు.. ఇద్దరు మృతి
ఓ మహిళ పట్ల రాహిల్ అనుచిత ప్రవర్తన వీడియో వైరల్ కావడంతో ఎంఎన్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తులా మరాఠీ సంస్కృతిని కాపాడేది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాహిల్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.ఈ వివాదంపై MNS పార్టీ స్పందించింది. ఇలాంటి అసభ్యకర చర్యలను తమ పార్టీ అసలు సమర్థించదని స్పష్టం చేసింది. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వెల్లడించింది.
ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కాగా కొంతకాలంగా మరాఠీయేతరులపై మహారాష్ట్రలో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీ కారణమని తెలుస్తోంది. తాము మరాఠీ భాష, సంస్కృతికి పరిరక్షకులమని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారని సమాచారం. ఇలాంటి సమయంలో అదే పార్టీకి చెందిన కీలక నేత కుమారుడు మరాఠీ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


