Modern Warfare Enters “Third Revolution” Era: ఆధునిక యుద్ధం “మూడో విప్లవ” దశలోకి ప్రవేశించిందన్నారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్. వేగవంతమైన సాంకేతిక పురోగతి, మారుతున్న భౌగోళిక-రాజకీయ పరిస్థితులు దీనికి కారణమని వివరించారు. సైనిక వ్యవహారాలపై జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక యుద్ధం కైనెటిక్ (ప్రత్యక్ష దాడి) మరియు నాన్-కైనెటిక్ (ప్రత్యక్షం కాని) పద్ధతుల కలబోతగా ఉండనుందని తెలిపారు. ఇటువంటి యుద్ధంలో పై చేయి సాధించడానికి “హైబ్రిడ్ యోధులు” అనే కొత్త రకం సైనిక నిపుణులు అవసరమని చెప్పారు.
ఈ మూడు ఎంతో కీలకం..
ఈ హైబ్రిడ్ యోధులు యుద్ధంలోని అన్ని డొమైన్‌లు (భూమి, సముద్రం, గాలి, సైబర్, అంతరిక్షం) మరియు అన్ని స్థాయిలలో (వ్యూహాత్మక, కార్యాచరణ, వ్యూహాత్మక) సమర్థవంతంగా పనిచేయగలగాలని చౌహాన్ వివరించారు. భవిష్యత్ యుద్ధానికి సాంప్రదాయ పోరాట వీరులతో పాటు సాంకేతిక (టెక్), సమాచార (ఇన్ఫో), విజ్ఞాన (స్కాలర్) యోధులు అవసరమని పేర్కొన్నారు.
విఫలమైతే వెనుకబడినట్లే..
ముఖ్యంగా “స్కాలర్ యోధులు” కీలక పాత్ర పోషిస్తారని సీడీఎస్ చౌహాన్ చెబుతున్నారు. వారి మేధో శక్తిని ఆచరణాత్మక సైనిక నైపుణ్యంతో జోడిస్తే అనేక రకమైన సరికొత్త సవాళ్లను ఎదుర్కోవచ్చని తెలిపారు. అలాగే, “ఇన్ఫో యోధులు” కథనాలను రూపొందించడానికి, ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి అవసరమని అన్నారు. ఈ నూతన మార్పును అంగీకరించి అందుకు అనుగుణంగా మారడంలో విఫలమయ్యే దేశాలు.. రక్షణ రంగం, ప్రపంచంపై ప్రభావం చూపడం.. రెండింటిలోనూ వెనుకబడిపోతాయని చౌహాన్ హెచ్చరించారు.


