Russia Ukraine War: షాంఘై సహకార సంస్థ(SCO) వార్షిక సదస్సు సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ చైనా టియాంజిన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముఖ్యమైన సమావేశం జరిపారు. ఇండియా–అమెరికా సంబంధాలు ప్రస్తుతం రష్యా నుంచి భారత చమురు దిగుమతుల కారణంగా ఉద్రిక్తంగా ఉన్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన కోసం జరుగుతున్న తాజా ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తుందని మోదీ వెల్లడించారు. రెండు పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగి యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణాన్ని తక్షణమే నిలిపివేసి శాంతి స్థాపనకు ఇరు దేశాల మధ్య చర్చలు కీలకమని, ఆ దేశాల నాయకులకు మానవాళి తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు మోదీ. దీంతో మోదీ కామెంట్స్.. ఉక్రెయిన్ యుద్ధం పట్ల భారత్ నిరంతరం పాటిస్తున్న సమతుల్య వైఖరిని మరోసారి ప్రతిబింబించాయి.
పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలను కఠినతరం చేస్తున్న సమయంలో భారత్ మాత్రం చమురు దిగుమతుల ద్వారా మాస్కోతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ కారణంగానే అమెరికా ఇటీవలి కాలంలో భారత ఉత్పత్తులపై వాణిజ్య సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేసిన క్రమంగా మోదీ కామెంట్స్ వచ్చాయి. భారత్–రష్యా సంబంధాలు ఎన్నో సవాళ్ల మధ్య కూడా ఎప్పుడూ ముందుకు సాగాయని అన్నారు మోదీ. ఈ స్నేహం ప్రపంచ స్థాయిలో శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి కీలకమని అన్నారు. అలాగే రాబోయే నెలల్లో పుతిన్ భారత్ పర్యటనకు వస్తారని కూడా మోదీ వెల్లడించారు.
ఇరు నేతలు ద్వైపాక్షిక భేటీలో ప్రత్యేకంగా రక్షణ, ఇంధన రంగాలు, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఒకవైపు భారత్–రష్యా భాగస్వామ్యాన్ని బలపరుస్తూ.. మరోవైపు ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి మోదీ మానవతా కోణంతో ఇచ్చిన శాంతి స్థాపన పిలుపు అంతర్జాతీయ వేదికపై అందరినీ ఆకట్టుకుంది.


