PM Modi Investments: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. ఆయన జీవితాంతం సంపాదించిన డబ్బును రిస్క్ లేని.. స్థిరమైన రాబడులు ఇచ్చే పెట్టుబడులలోనే పెట్టడం ఆయన ఆర్థిక జీవన తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మోదీ మోడ్రన్ అయినప్పటికీ పెట్టుబడుల విషయంలో ఆయన ఇప్పటికీ తాను పుట్టిన రోజుల్లోనే ఉండిపోయారని ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే తెలుస్తోంది. మోదీ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉంది. ఆయన ఎస్‌బీఐ గాంధీనగర్ బ్రాంచ్‌లో పెట్టిన మొత్తం డిపాజిట్లు రూ.3.26 కోట్లు. ఈ FDల నుండి వడ్డీ రూపంలో ఏడాదికి సుమారు రూ.2.20 లక్షలు పొందుతున్నారు.
2025 మార్చి 31 నాటికి మోదీ సంపద మొత్తం రూ.3.43 కోట్లుగా ఉంది. ఇది ఒక సంవత్సరం క్రితం ఉన్న రూ.3.02 కోట్ల కంటే ఎక్కువే. అంతేకాకుండా 2014 ఎన్నికల సమయంలో ఆయన ఆస్తులు రూ.1.65 కోట్లు మాత్రమే ఉండగా.. 2019 నాటికి అవి రూ.2.51 కోట్లకు పెరిగాయి. 11 సంవత్సరాల్లో ఆయన జమ చేసిన సంపద రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఇంకో ముఖ్యమైన పెట్టుబడి ఆయన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC). పోస్టాఫీస్ ద్వారా లభించే ఈ చిన్న పొదుపు పథకంలో మోదీ రూ.9.74 లక్షలు పెట్టుబడి పెట్టారు. 5 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఈ స్కీమ్ 7.7% వడ్డీ ఇస్తుంది. పైగా ఆదాయపు పన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద వడ్డీపై పన్ను రాయితీ కూడా ఉంటుంది.
ఆభరణాలుగా మోదీ వద్ద 45 గ్రాముల బరువున్న నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.3.10 లక్షలు. దీనికి తోడు ప్రధాని చేతిలో ఉన్న నగదు రూ.59,920 మాత్రమే. బ్యాంక్ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్లను తప్పించి మిగిలిన బ్యాలెన్స్ కేవలం రూ.1,104 మాత్రమే కావటం గమనార్హం. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. మోదీ మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్లు లేదా డిబెంచర్లలో ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు. అంటే రిస్క్ తక్కువగా ఉండే ప్రభుత్వం లేదా బ్యాంక్ స్కీమ్స్ పైనే మోదీ నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
ప్రధానిగా ఉన్న మోదీకి రెండు ఆదాయ వనరులు ఉన్నాయి. ఒకటి ఆయన పొందుతున్న వేతనం కాగా రెండవది ఆయనకు ఉన్న డిపాజిట్ల నుంచి లభించే వడ్డీ సొమ్ము. సాధారణ జీవనం, స్థిరమైన పెట్టుబడులు, పారదర్శకమైన ఆర్థిక వ్యవహారాలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫైనాన్షియల్ లైఫ్ సాధారణ భారతీయులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అధిక రాబడుల కోసం అంటూ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా.. చిన్న పొదుపు కూడా భవిష్యత్తుకు భరోసాని ఇవ్వగలదని మోదీ ఆచరణలో పాటించి చూపిస్తున్నారు.


