తెలంగాణ సర్కారు సహకరించక ప్రజలు నష్టపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు, పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి ఇలా ఆటంకాలు సృష్టిస్తుండటంతోనే అభివృద్ధి ఆలస్యంగా సాగుతోందన్నారు.
పిడికెడు మంది అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, కుటుంబ రాజకీయాలు, బంధువులు, అవినీతి వంటివి పెట్రేగి పోవటంతో నిజాయితీగా పనిచేసే వారితో చిక్కులు ఎదుర్కొంటున్నారని కేసీఆర్ కుటుంబాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.
కేవలం తమ కుటుంబాభివృద్ధి మాత్రమే వారు చూసుకుంటూ, స్వార్థం కొద్దీ ప్రతి ప్రాజెక్టు పనుల్లో తలదూర్చుతారంటూ తెలంగాణ ప్రజలు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. అవినీతిపరులంతా జట్టుకట్టుకుని కోర్టుకెళ్లినా వాళ్లకు తిరస్కారమే ఎదురైందంటూ, అవినీతిపరులకు శిక్ష తప్పదని హెచ్చరించటం విశేషం.
కుటుంబ రాజకీయాలున్నచోటే ప్రతి అవినీతి ప్రారంభమవుతుందన్నారు. సమస్యలన్నీ కుటుంబ పాలనతోనే ముడిపడి ఉంటాయని హెచ్చరించారు మోడీ. భాగ్యలక్ష్మిని వెంకటేశ్వర స్వామితో వందేభారత్ రైలుతో కలిపామంటూ పాతనగరంలోని భాగ్యలక్ష్మి మందిరం ప్రస్తావించారు మోడీ.