ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజులు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే లక్షల కోట్ల ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయనున్నారు. మొత్తం రూ.77,400 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.
ఇటీవల జరిగిన “ఆపరేషన్ సింధూర్” అనంతరం మోడీ తొలిసారిగా గుజరాత్‌కు వస్తుండటంతో రాష్ట్ర బీజేపీ నేతలు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ఈరోజు దాహోద్‌లో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన లోకోమోటివ్ ఫ్యాక్టరీని అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశీయంగా అత్యాధునికంగా నిర్మించిన ఈ కర్మాగారం నుంచి తొలి 9000 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ఇంజిన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు దేశీయ రైల్వే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.
దాహోద్ ప్రాంతంలో రూ.24,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రణాళికలకు మోదీ శంకుస్థాపన చేయనుండగా, భుజ్‌లో మరో రూ.53,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇది గుజరాత్‌లోని మౌలిక సదుపాయాల రంగాన్ని కొత్త దశలోకి తీసుకెళ్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రధాని మే 27న గాంధీనగర్‌కు వెళ్లి గుజరాత్ పట్టణాభివృద్ధి సంస్థ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే వేదికగా పట్టణాభివృద్ధి సంవత్సరం 2025ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రపంచ ప్రమాణాలకు తగిన విధంగా ట్రాన్స్‌పోర్ట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పానికి నిదర్శనంగా ఈ పర్యటనలో మోదీ ప్రకటించబోయే పథకాలు భారీ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ దేశ ఆర్థిక ప్రగతిలో కీలక మైలురాళ్లుగా నిలవనున్నాయి.