PM Modi Trinidad Tour: భారత ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకున్నారు. ఆ దేశంలో అడుగుపెట్టిన మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ట్రినిడాడ్ ప్రధాని, భారత సంతతి మహిళ కమలా ప్రసాద్ బీస్సేస్సార్ సాదరంగా ఆయనను స్వాగతలించారు. ఆమెతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం ఆకర్షణీయంగా నిలిచింది. అలాగే ప్రజలు భారత ఇతిహాస పాత్రలకు సంబంధించిన దుస్తులు ధరించి అలరించారు. అంతేకాకుండా మోదీకి స్వాగతం పలుకుతూ భోజ్‌పురి జానపద గీతమైన చౌతల్ పాడారు.
అనంతరం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. వారిని అయోధ్యకు రావాలని ఆహ్వానించారు. తనతో పాటు అయోధ్య రామాలయం ప్రతిరూపం, సరయు నది పవిత్ర జలం తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఇక్కడి ప్రజలు పవిత్ర జలంతో పాటు శిల పంపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ పూర్వీకులు భారత్‌లోని బిహార్ రాష్ట్రానికి చెందిన వారన్నారు. అందుకే ఆమెను బిహార్ కుమార్తెగా భావిస్తారని తెలిపారు. బిహార్ వారసత్వం ప్రపంచానికే గర్వకారణమని వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. ట్రినిడాడ్‌లోని పలు వీధులకు భారతదేశంలోని నగరాల పేర్లు ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఇక్కడి ప్రజలు భారత్‌లోని తమ పూర్వీకుల గ్రామాలను సందర్శించాలని మోదీ పిలుపునిచ్చారు.

ఇక ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ ప్రసంగిస్తూ గతంలో మోదీ రాసిన ఓ పుస్తకంలోని కవితను ప్రస్తావించారు. ఈ కళ్లు ఎంతో అదృష్టం చేసుకున్నాయంటూ గుజారతీ భాషలో మోదీ రాసిన కవితను ఆమె ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా 1999 తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోకు భారత ప్రధాని చేసిన తొలి పర్యటన ఇదే కావడం విశేషం. భారత సంతతికి చెందిన ప్రజలు దబాద్దాల క్రితం ట్రినిడాడ్ దేశానికి వలస వెళ్లారు. ప్రసుత్తం దాదాపు 40శాతం మంది భారత సంతతి ప్రజలు అక్కడ ఉండటం విశేషం.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఘనా చేరుకున్నారు. అక్కడి పర్యటన అనంతరం ట్రినిడాడ్ చేరుకున్నారు. ఈ పర్యటన అనంతరం జూలై 4, 5 తేదీల్లో అర్జెంటీనా వెళ్తారు. ఆ తర్వాత బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. చివరగా జులై 9వ తేదీన నమీబియాలో పర్యటిస్తారు. అనంతరం భారత్‌కు తిరిగి పయనమవుతారు.