PM Modi on Indian Farmers’ Protection : స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసింది. అయితే, ఆ ప్రసంగంలో కేవలం ప్రగతి మంత్రాలే కాదు, అమెరికా వంటి అగ్రరాజ్యానికి ఒక పరోక్షమైనా బలమైన హెచ్చరిక కూడా ఉంది. భారత రైతులపై ఈగ వాలినా సహించేది లేదని, వారి ప్రయోజనాలకు అడ్డుగోడగా నిలబడతానని మోదీ చేసిన ఉద్ఘాటన వెనుక ఉన్న వ్యూహమేమిటి..? ఈ మాటల తూటాలు ఎవరిని ఉద్దేశించినవి..? అసలు అమెరికా తీసుకున్న ఏ నిర్ణయం మోదీని ఈ స్థాయిలో స్పందించేలా చేసింది..?
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 50% సుంకాలు విధించడం భారత రైతులు, పాడి రైతులు, మత్స్యకారులకు హానికరం అని పేర్కొన్నారు. ఈ చర్యను తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు.
“భారత రైతుల ప్రయోజనాలకు నేను అడ్డుగోడలా నిలుస్తా” అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు పరోక్షంగా, కానీ దృఢంగా సందేశం పంపారు. ఈ మాటలు కేవలం హామీ మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచ వాణిజ్య సమీకరణాల్లో భారత్ తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటుందో చెప్పే ఒక బలమైన సంకేతం.
‘ఆత్మనిర్భర్’ నుంచి ‘వికసిత్ భారత్’ వరకు: ప్రధాని మోదీ తన ప్రసంగంలో ‘ఆత్మనిర్భర భారత్’ ఆవశ్యకతను మరోసారి నొక్కిచెప్పారు. ‘ఓకల్ ఫర్ లోకల్’ అనేది కేవలం ఒక నినాదం కాదని, అది ప్రతి భారతీయుడి నరనరాల్లో జీర్ణించుకోవాల్సిన నిరంతర జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. సెమీకండక్టర్ల నుంచి సాధారణ వస్తువుల వరకు అన్నింట్లోనూ భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు.”త్వరలోనే ‘మేడ్ ఇన్ ఇండియా’ చిప్స్ ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తనున్నాయి” అని ధీమా వ్యక్తం చేశారు. ఇంధన రంగంలో కూడా 2047 నాటికి అణు విద్యుత్‌ను పది రెట్లు పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, 2030 నాటికి నిర్దేశించుకున్న 50 శాతం క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని 2025 నాటికే సాధించామని గర్వంగా ప్రకటించారు.
రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యం: భారత వ్యవసాయ రంగం సాధిస్తున్న ప్రగతిని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ఏడాది భారత రైతులు అన్ని రికార్డులను బద్దలు కొట్టి అద్భుతమైన ఉత్పత్తిని సాధించారని కొనియాడారు. పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో, వరి, గోధుమ, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలవడం మన రైతుల ఘనత అని పేర్కొన్నారు. ‘పసల్ బీమా యోజన’ వంటి పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని, రూ. 4 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారని తెలిపారు. కేవలం రైతులకే కాకుండా, పశుసంపద పరిరక్షణకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోవిడ్ సమయంలో 125 కోట్ల పశు వ్యాక్సిన్లను ఉచితంగా అందించామని, గాలికుంటు వ్యాధి నివారణలో ఇది కీలక పాత్ర పోషించిందని వివరించారు.
యువత, మహిళలే దేశానికి బలం: దేశ యువత కోసం, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మోదీ వివరించారు. యువతలో ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించేందుకు ‘వికసిత్ భారత్ యోజన’ కింద లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా కొత్తగా ఉద్యోగాలు కల్పించే కంపెనీలలోని ఉద్యోగులకు నెలకు రూ. 15,000 కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. మరోవైపు, ‘డ్రోన్ దీదీ’ పథకం ద్వారా గ్రామీణ మహిళలు సాధికారత సాధిస్తున్నారని, మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.
మొత్తం మీద, ప్రధాని ప్రసంగం ఒకవైపు దేశ ప్రగతిని ఆవిష్కరిస్తూనే, మరోవైపు ప్రపంచ వేదికపై భారత ప్రయోజనాలను, ముఖ్యంగా రైతుల హక్కులను కాపాడటంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదనే బలమైన సందేశాన్ని ఇచ్చింది.


