India’s reaction to Gaza peace plan : గాజాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం మొదటి దశకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ చొరవను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వానికి నిదర్శనంగా అభివర్ణించారు. అసలు ఈ ఒప్పందం ప్రాముఖ్యత ఏంటి…? మోదీ స్పందన అంతర్జాతీయంగా ఎలాంటి సంకేతాలనిస్తోంది..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన మొదటి దశ శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేయడాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
“అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళికలోని మొదటి దశ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఇది ప్రధానమంత్రి నెతన్యాహు యొక్క బలమైన నాయకత్వానికి కూడా ప్రతిబింబం,” అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ద్వారా గాజాలో శాశ్వత శాంతి నెలకొనాలని, స్థానిక ప్రజలకు మెరుగైన మానవతా సహాయం అందాలని ప్రధాని ఆకాంక్షించారు. అంతేకాకుండా, హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారందరూ త్వరలోనే సురక్షితంగా విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం గాజా ప్రజలకు ఊరటనిచ్చి, శాశ్వత శాంతికి మార్గం సుగమం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒప్పందంలోని ముఖ్యాంశాలు: అమెరికా, ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం, మొదటి దశలో ఇరు పక్షాలు కాల్పుల విరమణ పాటించనున్నాయి. దీనికి బదులుగా హమాస్ తమ వద్ద ఉన్న బందీలలో కొందరిని విడుదల చేయనుండగా, ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది.ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే, సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సంఘర్షణకు ముగింపు పలికే దిశగా ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అవుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


