గతంలో మంకీపాక్స్ అని పిలిచే ఎంపాక్స్ ఇప్పుడు భారతదేశానికి సరికొత్త సవాలు విసురుతోంది. ఈ వైరస్ ప్రధానంగా కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర పట్టణాలలో వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ను ఆఫ్రికాతో పాటు మధ్య ప్రాచ్య దేశాలకు చెందిన వారిలో గుర్తించారు. ఈ వైరస్‌కు20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు ఎక్కువగా ప్రభావితమవుతారంటూ ఈ వైరస్ లక్షణాలు, నివారణ మార్గాలను అంకురా హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్‌లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ అలర్జీ స్పెషలిస్ట్‌గా సేవలు అందిస్తున్న డాక్టర్ ఆనంద్ సుభాష్ వని తెలిపారు.
ఎంపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, మరణాల రేటు తక్కువగానే ఉందని, ఇది 1.5 శాతంగా ఉందని డాక్టర్ ఆనంద్ సుభాష్ వని పేర్కొన్నారు. ఈ వైరస్ సోకినవారిలో చాలామంది రెండు నుండి నాలుగు వారాలలోపు కోలుకుంటారని, అయినప్పటికీ వారి రోగనిరోధక వ్యవస్థలపై వైరస్ కారణంగా తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ వైరస్ ను ఎదుర్కొనేందుకు భారతదేశం తన ప్రజారోగ్య ప్రయత్నాలను తీవ్రతరం చేసిందన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐదు లక్షల నమూనాలను పరీక్షించిందని, వీటిలో 0.04 శాతం పాజిటివ్ రేటు ఉన్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటూ |భారత్‌తో కేవలం 0.03శాతం ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయని, అయితే ఇది అందరూ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తుందని డాక్టర్ ఆనంద్ పేర్కొన్నారు.
ఎంపాక్స్ సాధారణంగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో ఫ్లూ తరహా లక్షణాలతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత దద్దుర్లు ఏర్పడి ద్రవంతో నిండిన బొబ్బలుగా మారతాయి. హైదరాబాద్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 10శాతం కేసులు నమోదయ్యాయి. ఎంపాక్స్ సోకిన చిన్నారులు సాధారణంగా రెండు నుంచి నాలుగు వారాల్లో కోలుకుంటారు. ఎంపాక్స్ నివారణకు వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించాలని, పరిశుభ్రతను పాటించాలని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ ఆనంద్ సుభాష్ తెలిపారు.