Honeymoon Murder Case High Court: మేఘాలయలో హనీమూన్ మర్డర్ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజు దహనం చేయాలనే నిర్ణయంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితురాలు లేదా ఇతర వ్యక్తుల దిష్టిబొమ్మలను దహనం చేయకుండా చూడాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. దసరా రోజున ‘సూర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ వెల్లడించిన నేపథ్యంలో.. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనమ్‌తో వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అక్కడ ప్రియుడితో కలిసి భర్తను సోనమ్ హత్య చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో దసరా రోజున ‘సూర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ పేర్కొంది. సోనమ్‌తో పాటు భర్తలు, పిల్లలు, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో సోనమ్ తల్లి సంగీత ఆ సంస్థకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ ప్రణయ్ వర్మతో కూడిన సింగిల్ బెంచ్ నేతృత్వంలో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. అలాంటి దిష్టిబొమ్మ దహనానికి అనుమతి లేదని శనివారం తీర్పునిచ్చింది. ఇది పిటిషనర్, ఆమె కుమార్తె, కుటుంబం ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
కాగా, భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్య ఆమోదయోగ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 కింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేరని స్పష్టం చేసింది. అలాంటి దిష్టిబొమ్మ దహనం జరగకుండా చూడాలని, మహిళా నిందితులు, వారి కుటుంబాల ప్రతిష్ఠను దెబ్బతీసే చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను నిరోధించాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


