Raghav Chadha vs AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చడ్డాను రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తొలగించడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై చడ్డా వీడియోపై ఘాటుగా స్పందించారు. ఈ వీడియోపై ఆప్ నేతలు కౌంటర్ సైతం ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలో రాఘవ్ అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా, రాఘవ్ చడ్డాను ఆప్ రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించింది. దీంతో ఈ పరిణామంపై చడ్డా స్పందించారు.
పార్టీ తనను పదవి నుంచి తొలగించడమే కాకుండా, పార్లమెంటులో మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్‌కు లేఖ రాయడంపై రాఘవ్ వ్యూహాత్మకంగా స్పందించారు. గతంలో తాను పార్లమెంటులో మొబైల్ డేటా ఎక్స్‌పైరీ, పితృత్వ సెలవులు, పేపర్ లీకేజీలు, ఎయిర్‌పోర్టుల్లో స్నాక్స్ రేటు పెంచడం వంటి ప్రజా సమస్యలపై చేసిన ప్రసంగాలతో కూడిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
తానెప్పుడూ ‘ప్రజా పక్షపాతి’గానే ఉంటానని, తన గొంతును ఎవరూ నొక్కలేరని పరోక్షంగా చడ్డా సంకేతాలిచ్చారు. ఈ వీడియోకు ఆయన కేవలం దిష్టిబొమ్మ ఎమోజీని మాత్రమే జోడించడం విశేషం. తనను నిశ్శబ్దంగా ఉండేలా చేశారు కానీ, తాను ఓడిపోలేదని వ్యాఖ్యానించారు.
ఈ వీడియోపై ఆప్ అధిష్ఠానం కౌంటర్ ఇచ్చింది. ప్రజా సమస్యల కంటే చడ్డాకు సమోసాలే ముఖ్యమయ్యాయని పార్టీ ఎద్దేవా చేసింది. గుజరాత్‌లో ఆప్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆ అంశాలను ప్రస్తావించలేదు. ప్రధానమంత్రిని లేదా కీలక అంశాలను వదిలేసి, సమోసా రేట్ల వంటి చిన్న విషయాలపై రాఘవ్ ప్రశ్నలు అడుగుతున్నారని మండిపడింది. సమస్యల గురించి కాకుండా అనవసర విషయాలపై మాట్లాడుతున్నారని ఆప్ కౌంటర్ ఇచ్చింది. సభలో ఉన్న కొద్దిపాటి సమయంలో కీలక అంశాలను లేవనెత్తాలని సూచించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై రాఘవ్ సంతకం చేయలేదని విమర్శించింది. పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసినా ఆయన మాత్రం బయటకు రాలేదని.. రాఘవ్ ప్రధాని మోదీకి భయపడుతున్నారని ఆరోపించింది. చడ్డా ప్రవర్తనతో ఆప్ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడటాన్ని సూచిస్తున్నాయి.

