Air India IndiGo Wingtip Collision : దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ముంబయి విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వందలాది మంది ప్రయాణికులతో నిండిన రెండు భారీ విమానాలు రన్‌వే పై ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న ఓ విమానం.. ల్యాండ్ అయి వస్తున్న మరో విమానం.. రెండింటి రెక్కలు బలంగా తాకాయి. చిన్నపాటి నిర్లక్ష్యం జరిగినా పెను విషాదం జరిగి ఉండేది. అసలే రద్దీగా ఉండే ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో, అదీ అత్యంత నిఘా ఉండే ట్యాక్సీవే పై రెండు విమానాలు ఎలా ఢీకొన్నాయి? పైలట్ల తప్పిదమా లేక కంట్రోల్ రూమ్ సమన్వయ లోపమా? ఈ ఘటన వెనుక అసలు కారణాలేంటి? పూర్తి వివరాలు మీకోసం..
రెక్కలు రాసుకున్న వేళ : మంగళవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి నుంచి కోయంబత్తూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI2732) టేకాఫ్ కోసం ట్యాక్సీవే పై వేచి ఉంది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముంబయి వచ్చిన ఇండిగో విమానం (6E791) ల్యాండింగ్ పూర్తి చేసుకుని పార్కింగ్ బే వైపు వెళ్తోంది. ఈ క్రమంలో రెండు విమానాల రెక్కల చివరి భాగాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
సాంకేతిక వివరాలు : పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రాథమిక సమాచారం ప్రకారం..
ఎయిర్ ఇండియా విమానం C1 పాయింట్ నుంచి M4 వైపు టేకాఫ్ కోసం వెళ్తుండగా..
ఇండిగో విమానం B1 పాయింట్ వైపు టర్న్ తీసుకుంటోంది. ఈ సమయంలో అంచనా తప్పడంతో రెండు విమానాల కుడివైపు రెక్కలు ఒకదానికొకటి తాకాయి.
ప్రయాణికులు సేఫ్ – విమానాలు గ్రౌండెడ్ : ఈ ఘటనతో విమానంలో కుదుపులు ఏర్పడటంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
ఎయిర్ ఇండియా ప్రకటన: “మా విమానం టేకాఫ్ కోసం వేచి ఉండగా ఈ ఘటన జరిగింది. రెక్క భాగం దెబ్బతినడంతో, ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని నిలిపివేశాం. ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించాం” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ఇండిగో స్పందన: “ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాం. విమానాన్ని మెయింటెనెన్స్ తనిఖీల కోసం తరలించాం” అని ఇండిగో సంస్థ పేర్కొంది.
రంగంలోకి డీజీసీఏ (DGCA) : ఘటన జరిగిన వెంటనే ఏవియేషన్ రెగ్యులేటర్ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ (DGCA) బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. రెండు విమానాలు ఎయిర్‌బస్ A320 రకానికి చెందినవే. అత్యంత రద్దీగా ఉండే సమయంలో, పారలల్ ట్యాక్సీవేల వద్ద ఈ పొరపాటు ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. విమానాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.

