ఆలోచనలు ఉండాలే గానీ.. సంపాదించడానికి సవాలక్ష దారులున్నాయి. ఈ ఆధునికయుగంలో అది.. ఇది.. అనే తేడాలేకుండా.. ప్రతి దానిని క్యాష్ చేసుకుంటున్నారు. నీళ్లు మొదలు.. తినే తిండి, వేసుకునే దుస్తుల వరకూ.. హుందా గా బతకడానికి కావలసినవన్నీ మార్కెట్లో ఇట్టే అందుబాటులోకి వస్తున్నాయి. మరి మనిషి చనిపోయాక చేసే.. కర్మకాండలు జరిపించేందుకు ఒక కంపెనీ ఎందుకు ఉండకూడదనుకున్నారేమో.. తమ ఆలోచనలను కార్యరూపంలో పెడుతూ ఓ స్టార్టప్ ను ఏర్పాటు చేస్తున్నారు. మరెక్కడో కాదు.. మన దేశంలోనే. అదీ మన ఆర్థిక రాజధాని ముంబైలో ఈ స్టార్టప్ కు తొలి అడుగు పడింది.
ముంబైలో ప్రారంభమైన ఈ స్టార్టప్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఈ స్టార్టప్ కర్మకాండలు జరిపిస్తుందట. ‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఏర్పాటైన ఈ స్టార్టప్ కర్మకాండలతోపాటు అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేయడం వంటి సేవలు అందిస్తామంటోంది. కర్మకాండలు నిర్వహించేందుకు ఈ స్టార్టప్ రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తుందట.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమవుతోన్న సమయంలో ఇలాంటి స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి. తల్లిదండ్రులు ఒక ప్రాంతంలో.. పిల్లలు మరో దేశంలో. కన్నవారు ఇకలేరన్న వార్త తెలిసినా అంతదూరం వెళ్లడం వృథా ఖర్చుగా భావించేవారు కోకొల్లలు. అంత్యక్రియలు చేసేందుకు నోచుకోని వారందరికీ ఈ స్టార్టప్ కర్మకాండలు జరిపిస్తుందట. రూ.37,500 కడితే అంతా వారే చూసుకుంటారట. ఢిల్లీలో జరిగే ట్రేడ్ ఫెయిర్ లో ఈ దుకాణం వెలిసింది. ఇప్పటి వరకూ రూ.50 లక్షల ఆదాయంతో ఉన్న ఈ స్టార్టప్.. వచ్చే ఏడాదికి 2 వేల కోట్ల వ్యాపారానికి పెరుగుతుందని అంచనా.
ఐఏఎస్ అధికారి అవనీశ్ వైష్ణవ్ ఈ స్టార్టప్ ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ.. ఇలాంటి స్టార్టప్‌లతో అవసరం ఏముంది? అని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటివి మనకి కొత్తకావచ్చు కానీ.. విదేశాల్లో ఇలాంటివి కామనేనని కొందరు అంటే.. మరికొందరు ఈ స్టార్టప్ పై పెదవి విరుస్తున్నారు. మనిషి ఏ పని చేయకుండా సుఖానికి మాత్రమే అలవాటుపడేలా, విలువలను, బంధాలను, బంధుత్వాలను దెబ్బతీసేలా వచ్చే ఇలాంటి స్టార్టప్ లను ప్రోత్సహించకూడదు అంటున్నారు.