Sunday, November 16, 2025
Homeనేషనల్Mumbai: స్నేహితుడిపై ప్రతీకారం కోసమే..ముంబయి బెదిరింపులు!

Mumbai: స్నేహితుడిపై ప్రతీకారం కోసమే..ముంబయి బెదిరింపులు!

Mumbai Bomb Threat:ముంబై నగరాన్ని బాంబులతో ధ్వంసం చేస్తామంటూ వచ్చిన ఓ వాట్సాప్ సందేశం శుక్రవారం రాత్రి తీవ్ర ఆందోళన రేపింది. దేశ ఆర్థిక రాజధానిపై దాడి జరుగుతుందనే సమాచారంతో పోలీసులు వెంటనే హై అలర్ట్ ప్రకటించారు. కానీ ఆ బెదిరింపుల వెనక అసలు నిజం బయటపడిన తర్వాత అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.

- Advertisement -

జ్యోతిష్య శాస్త్రం, వాస్తు సలహాలు..

ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బెదిరింపులు ఇచ్చింది బీహార్‌లోని పట్నాకు చెందిన అశ్విని కుమార్‌ అనే వ్యక్తి. వయసు 51 ఏళ్లు. అతను గత ఐదేళ్లుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివసిస్తూ జ్యోతిష్య శాస్త్రం, వాస్తు సలహాలు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. అశ్విని కుమార్ ఒక వ్యక్తి అయిన ఫిరోజ్‌తో డబ్బు సంబంధిత విభేదాలు పెట్టుకున్నాడు. ఆర్థిక వ్యవహారాల్లో ఇద్దరి మధ్య కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. గతంలో ఫిరోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో అశ్విని మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు.

“లష్కర్-ఎ-జిహాదీ”..

ఆ అనుభవం తర్వాత అశ్విని ఫిరోజ్‌పై ద్వేషంతో మండిపోయాడు. అతడిని ఇబ్బందుల్లోకి నెట్టాలని నిర్ణయించాడు. అందులో భాగంగా ముంబై నగరాన్ని లక్ష్యంగా చేసుకొని భయపెట్టేలా ఒక కుట్ర పన్నాడు. “లష్కర్-ఎ-జిహాదీ” అనే పేరుతో ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపించాడు. ఆ మెసేజ్‌లో నగరంలో 34 వాహనాల్లో మానవ బాంబులు అమర్చామని, మొత్తం 400 కిలోల ఆర్డీఎక్స్ సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా, 14 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్‌లోకి వచ్చారని, త్వరలో ముంబైని వణికిస్తామని కూడా హెచ్చరించాడు.

రద్దీ ప్రాంతాల్లో భద్రత..

ఆ సందేశం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించి, ప్రతి వాహనాన్ని చెక్ చేశారు. సాంకేతిక విభాగం సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. మెసేజ్ పంపిన ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేసి, దాని వెనక ఉన్న వ్యక్తిని గుర్తించారు. చివరికి ఈ బెదిరింపుల వెనక నోయిడాలో ఉంటున్న అశ్విని కుమార్ ఉన్నట్లు తేలింది.

ఎలక్ట్రానిక్ పరికరాలను..

తక్షణమే ఒక ప్రత్యేక బృందం నోయిడాకు వెళ్లి అశ్వినిని అదుపులోకి తీసుకుంది. అతని వద్ద నుండి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అశ్విని మొత్తం ప్లాన్ వెనక కారణాన్ని వివరించాడు. తాను స్నేహితుడైన ఫిరోజ్‌ను ఉగ్రవాద కేసులో ఇరికించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నాటకాన్ని ఆడినట్లు అంగీకరించాడు.

Also Read:https://teluguprabha.net/cinema-news/ram-gopal-varma-faces-backlash-for-dawood-name-on-teachers-day/

పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందనే కారణంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా ఈ కేసులో విచారణ చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad